సహచట్టం కింద ఇవిఎంలు

ఎవరైనా పరిశీలించుకునే ఛాన్స్‌
న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): పదేశంలో ఎవరైనా రూ.10 చెల్లించి ఈవీఎంను అందజేయమని ఎన్నికల సంఘాన్ని కోరవచ్చు. సమాచార హక్కు (సహ) చట్టం ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) తేల్చిచెప్పింది. ఈవీఎంలు కూడా ‘సమాచార’ నిర్వచనం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇలాంటి సహ దరఖాస్తులకు ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఈవీఎంను ఇవ్వాలా? లేదా చట్టంలో పేర్కొన్న మినహాయింపులను వినియోగించుకుని అభ్యర్థనను తిరస్కరించాలా? అన్న విషయాన్ని ఈసీ తేల్చుకోవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే చట్ట ప్రకారం దరఖాస్తుదారులు తమ దాకా రావొచ్చని సీఐసీ స్పష్టం చేసింది. ఇటీవల ఇదే తరహాలో ఓ సహ దరఖాస్తు రాగా.. ఈవీఎం ‘సమాచారం’ నిర్వచనం కిందకు రాదని పేర్కొంటూ ఈసీ దాన్ని తిరస్కరించింది. రికార్డులు, నివేదికలు, ప్రకటనలు, ఇ-మెయిళ్లు, ఎలక్టాన్రిక్‌ రూపంలోని డేటా, మోడళ్ల వంటివన్నీ సమాచారమేనని చట్టంలో స్పష్టంగా ఉందని పేర్కొంటూ దరఖాస్తుదారుడు సీఐసీని ఆశ్రయించారు. దీంతో దరఖాస్తు తిరస్కరించినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు ఈసీ ప్రతినిధి సీఐసీకి వెల్లడించారు. దీంతో ఇక ఎవరైనా ఇవివెంలను పరిశీలించుకునే అవకాశం ఏర్పడనుంది.