సహజ వనరులున్నా దరిద్రం తీరడం లేదు: నైనాల

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌25: జిల్లాలో సహజ వనరులుఉన్నా ఇక్కడ ప్రజలకు న్యాయం జరగడం లేదని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని జలసాధన సమితి జిల్లా అధ్యక్షుడు నైనాల గోవర్దన్‌ అన్నారు.న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసి తాగు,సాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఆయన కోరారు.  జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి సాగు, తాగునీరు అందించాలని కోరారు. ప్రత్యేక తెలంగాన ఆవిర్భావం తరవాత కూడా ఇంకా దుర్భర పరిస్థితులు ఎలకొనడం దారుణమన్నారు. జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్పీఎంను తెరిపించి కార్మికుల కష్టాలు తీర్చాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయి రెండేళ్లు గుడుస్తున్నా అమరవీరుల కుటుంబాలకు ఇంకా పూర్తి న్యాయం జరగలేదన్నారు. లక్ష ఉద్యోగాలు ఎండమావిగానే మిగిలి పోయాయన్నారు. జిల్లాలోని అనేక మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఖరీఫ్‌లో 28 శాతం లోటుగా ఉన్న వర్షపాతం, అక్టోబరులో వర్షాలు లేకపోవడంతో లోటు 35 శాతానికి చేరుకుంది.  సాధారణంగా ఖరీఫ్‌లో సోయా సాగు చేసిన రైతులు రబీలో శనగ వేస్తారు. అలాంటిది ఈ ఏడాది శనగ సాగు చేసేందుకు రైతులు వెనుకంజ వేసారు. సాగుకు వీలుగా భూమిలో కనీసం తేమ లేకపోవడం, విత్తుకున్న తరువాత విద్యుత్తు కొరత ఏర్పడి విద్యుత్తు సరిగా సరఫరా కానట్లయితే నష్టపోయే వీలుంది. దీంతో రైతులు రబీపై ఆశలు వదులుకున్నారు.విత్తనాలు వచ్చినా సాగు చేసే పరిస్థితి లేకపోవడంతో వాటిని రైతులు తీసుకోవడం లేదు. దీంతో వచ్చే వర్షాకాలంలో కూడాజిల్లాలో  వరి పూర్తిగా సాగయ్యే పరిస్థితి లేదు.బోర్లు, బావుల్లో ఉన్న నీరు ఎండిపోవడంతో  విద్యుత్తు సమస్య రోజు రోజుకు తీవ్రంగా అవుతుండంతో సాగే అవకాశాలు కనిపించటం లేదు. జిల్లాలో నెలకొన్న ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించినా చర్యలు తీసుకోలేదని గోవర్ధన్‌ అన్నారు. గతేడాది   వర్షాభావం కారణంగా వరి, మొక్కజొన్న తదితర పంటల సాగు పూర్తిగా తగ్గిందన్నారు. జిల్లాలో నెలకొన్న వర్షభావ పరిస్థితుల కారణంగా పంటలు పూర్తిగా ఎండిపోయాయి. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు.