సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి హరీష్‌రావు తనిఖీలు

సిద్ధిపేట, నవంబర్‌11(జ‌నంసాక్షి) : నంగునూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉదయం సమయంలో మంత్రి హరీష్‌రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి హాజరు రిజిస్టర్‌ను మంత్రి పరిశీలించారు. సరియైన సమయానికి విధులకురాని డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి ఛార్జ్‌ మెమోలు జారీ చేసి సంజాయిషీ తీసుకోవాలని డీసీహెచ్‌ఎస్‌ను మంత్రి ఆదేశించారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు హరీష్‌రావు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం ఉండరాదని మంత్రి సూచించారు.
కానిస్టేబుల్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం: హరీష్‌
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం అక్కన్నపల్లి గ్రామంలో మృతిచెందిన కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం అక్కన్నపల్లి గ్రామానికి చేరుకుని కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ కుటుంబాన్ని
పరామర్శించారు. ఈ సందర్బంగా చంద్రశేఖర్‌ కుటుంబాన్ని అన్ని ఆదుకుంటామని మంత్రి హావిూ ఇచ్చారు. తొలుత అక్కన్నపల్లి గ్రామానికి విచ్చేసిన మంత్రి హరీష్‌రావు అక్కడ నూతనంగా ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.