సామాన్యుడి సంక్షేమానికి పెద్దపీట 

– ఏప్రిల్‌ చివరికల్లా ఇంటింటికి మిషన్‌ భగీరథ నీళ్లు
– అసెంబ్లీలో ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి23(జ‌నంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సామాన్యుడి సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో పువ్వాడ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం బాగుపడింది. వ్యవసాయం బాగుందన్నారు. ఏప్రిల్‌ చివరి కల్లా ఇంటింటికీ మిషన్‌ భగరథ నీళ్లు అందుతాయన్నారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఐటీ రంగంలో మెరుగైన ప్రగతిని సాధించుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను దేశంలోనే సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దామన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ. 40వేల కోట్లు కేటాయింపులు చేసినట్లు తెలిపారు.  వృద్ధాప్య పెన్షన్‌ అర్హత 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు చేయడం జరిగిందని, ఒంటరి హహిళలు, దివ్యాంగుల, వితంతువుల పెన్షన్లు రెట్టింపు చేశామన్నారు. రైతులకు ఏడాదికి రూ. 8వేల పంట పెట్టుబడి ఇస్తున్నామని, అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణను కోటిఎకరాల మాగాణిగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, సీఎం అద్భుత పాలనతో దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచారన్నారు. కుల, మతాలతో సంబంధం లేకుండా డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు ఇస్తున్న ప్రభుత్వం తెరాసనేనని అజయ్‌ అన్నారు. రైతుల అభివృద్ధి కోసం రూ. 50 వేల కోట్లకు పైగా కేటాయించడం గొప్ప విషయమని, తద్వారా రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు నిర్మూలించగలిగామని అజయ్‌ అన్నారు. వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, తెలంగాణ ఏర్పడితే కరెంట్‌ ఉండదని సమైక్య పాలకులు భయపెట్టారని, సీఎం కేసీఆర్‌ కృషితో 24 గంటల నిరంతర నాణ్యమైన కరెంట్‌ అందివ్వగలుగుతున్నామని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామిని నెరవేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు జిల్లాల విభజన, మండలాల ఏర్పాటు చేయలేక అభివృద్ధి కుంటపడిందని అన్నారు. చిన్న మండలాలు, జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి ఫలాలు ప్రతిఒక్కరికి అందుతాయనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ జిల్లాలను, మండలాలను ఏర్పాటు చేశారన్నారు. ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గంలో రఘునాథపాలెంను మండలంగా చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో అక్కడి ప్రజలు ఎన్నో వినతులు ఇచ్చారని, కానీ ప్రత్యేక తెలంగాణ అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ రఘునాథపాలెంను మండలంగా ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు. ఇలా అన్ని రంగాల్లో కేసీఆర్‌ తన అద్భుతమైన ఆలోచనతో, అన్ని వర్గాల ప్రజలు బాగు పడాలనే దృకత్పంతో ముందుకెళ్తున్నారని అజయ్‌ కుమార్‌ అభినందించారు.