సారీ.. ఆలస్యమైంది..!


– జలగం ప్రసాదరావుపై సస్సెన్షన్‌ ఎత్తివేత
– పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు ఆంటోని సమాచారం
– జలగం ప్రసాద్‌రావుకు ఫోన్‌ చేసిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
– పార్టీలోనే కొనసాగాలని సూచన
– సముచిత స్థానం కల్పిస్తామని వెల్లడి
– ఆలస్యమైంది.. నేనేం చేయలేనన్న ప్రసాద్‌రావు?
– గులాబీగూటికి వెళ్లేందుకే మొగ్గుచూపిన మాజీ మంత్రి
– నేడు కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరిక
ఖమ్మం, నవంబర్‌2(జ‌నంసాక్షి) : జలగం ప్రసాద్‌రావు.. ఈ పేరు ఉమ్మడి జిల్లా ప్రజలకే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితమే. గత ఆరేళ్ల క్రితం వరకు జిల్లా రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన మాజీ సీఎం జగలం వెంగళరావు తనయుడు మాజీ మంత్రి ప్రసాద్‌రావు.. కాంగ్రెస్‌ పార్టీ నుండి సస్సెన్షన్‌కు గురై నాటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.. కాగా సస్పెన్షన్‌ పూర్తయినా కాంగ్రెస్‌ అధిష్టానం కొనసాగిస్తూనే వస్తుంది.. ఈ నేపథ్యంలో అధిష్టానం తీరుతో అసహనానికి గురైన ప్రసాద్‌రావు.. గులాబీగూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.. దీంతో ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసాద్‌రావుతో చర్చలు జరిపి టీఆర్‌ఎస్‌లో చేరాలని కోరారు.. ప్రసాద్‌ సైతం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.. ఈ పరిస్థితులను గమనించిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం జలగం ప్రసాద్‌రావును పార్టీ మారకుండా చేసేందుకు ఉన్నట్లుండి అతని సస్పెన్షన్‌ ఎత్తివేసింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ కేంద్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ ఏకే ఆంటోని రాష్ట్ర పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు సమాచారం అందించారు.. దీంతో వెంటనే ప్రసాద్‌రావుకు ఫోన్‌చేసిన ఉత్తమ్‌.. పార్టీ మారొద్దని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని ప్రసాద్‌రావుకు సూచించినట్లు తెలుస్తోంది. కానీ ప్రసాద్‌రావు ఉత్తమ్‌ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆలస్యమైందని.. కార్యకర్తలకు పార్టీ మారుతున్నట్లు మాటిచ్చానని.. ఈ విషయంలో నేనేం చేయలేనని కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. ఈమేరకు శనివారం కేసీఆర్‌ సమక్షంలో జగలం ప్రసాద్‌రావు కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటం, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు కావడంతో ప్రసాదరావుకు ప్రాధాన్యం ఏర్పడింది. జలగం కుటుంబానికి పూర్వఖమ్మం జిల్లాలో మంచి ఆదరణ ఉంది. వెంగళరావు హయాంలో పూర్వ ఖమ్మం జిల్లాలో శాశ్వత ప్రతిపాదికన పనులు జరిగాయన్న పేరుంది. ప్రసాదరావు కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు. మంచి వ్యూహకర్తగా పేరుంది. 1991 ఆగస్టు 5 నుంచి 1994 వరకు ఆయన పంచాయితీరాజ్‌ శాఖ మంత్రిగా ఉన్నారు. 1990 నుంచి 1991 ఆగస్టు 4 వరకు రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1983, 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సత్తుపల్లి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ రెండు  పర్యాయాలు కూడా ప్రసాదరావు అప్పటి తెదేపా అభ్యర్థి అయిన తుమ్మల నాగేశ్వరరావుపై గెలిచారు. 1994 ఎన్నికల్లో మాత్రం తెదేపా అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. 1999 ఎన్నికల అనంతరం ప్రసాదరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 1999 సాధారణ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణపై కాంగ్రెస్‌ ప్రసాదరావును ఆరేళ్లపాటు సస్పెండ్‌ చేసింది.
అనంతరం కూడా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్‌ మళ్లీ ప్రసాదరావు సేవలు వినియోగించుకోవాలని భావించింది. ఇదే విషయంపై గతంలో కాంగ్రెస్‌ జిల్లా నేతలతో ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పలుమార్లు హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చింది. జలగం చేరికను పార్టీలోని కొందరు అడ్డుకుంటున్నారన్న ప్రచారం కూడా సాగింది. చేరిక విషయంపై స్పష్టత లేకపోవడం, టికెట్‌(పాలేరు) విషయంలో హావిూ లేకపోవడం కూడా ప్రసాదరావు అసంతృప్తికి కారణమైంది. కాగా ఈలోపు ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్‌, తుమ్మల జలగం ప్రసాద్‌రావుకు టచ్‌లోకి వెళ్లడంతో ప్రసాద్‌సైతం వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉండటంతో తుమ్మల నేరుగా గురువారం జలగం ప్రసాద్‌రావు ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో కార్యకర్తలతో సమావేశమైన జలగంప్రసాద్‌రావు ఏం చేస్తే బాగుంటుందని చర్చించారు. కాంగ్రెస్‌ పార్టీలో సస్పెన్షన్‌ పూర్తయినా ఎత్తివేయడం లేదని, తాను అధిష్టానాన్ని కూడా కోరానని ప్రసాద్‌రావు కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఉందామన్నా పార్టీ అధిష్టానం వివక్షతను ప్రదర్శిస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ కంటే టీఆర్‌ఎస్‌లోకి వెళితే మంచిదనే భావనతో ఉన్నట్లు కార్యకర్తలకు తెలిపారు. దీంతో కార్యకర్తలుసైతం అంగీకారం తెలపడంతో జలగం ప్రసాద్‌రావు టీఆర్‌ఎస్‌ గూటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది..