సార్వత్రిక సమ్మె విజయవంతం

5

స్తంభించిన రవాణా వ్యవస్థ

సింగరేణిలో నిలిచిన ఉత్పత్తి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి):

దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు తెలుగు రాష్టాల్ల్రో  సమ్మె కారణంగా రవాణా స్తంభించింది.  ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాలలో సవరణలు తేవడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా వామపక్షాలు,కార్మిక సంఘాలు  సమ్మె నిర్వహిస్తున్నాయి. సమ్మె కారణంగా రెండు రాష్టాల్ల్రో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపో గేట్ల ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. అనేక చోట్ల సమ్మె విజయవంతం అయినట్లు సమాచారం. ఎపి,తెలంగాణలలో రవాణ వ్యవస్థకు ఆటంకం కలిగింది. బస్సులు తిరగడం లేదు. హైదరాబాద్‌ లో ఆటోలు కూడా పలు చోట్ల ఆగిపోయాయి. సింగరేణి లో కార్మికులు సమ్మె చేస్తుండడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బ్యాంకులలో కూడా సమ్మె విజయవంతం అవుతుందని చెబుతున్నారు. చాలచోట్ల బ్యాంకులు మూతపడ్డాయి. కొన్నిచెఓట్ల అరకొర సిబ్బందితో బ్యాంకులు నడిచాయి. కర్నూలు జిల్లా ఆదోని వద్ద బస్‌ అను కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది.

ఆదిలాబాద్‌లో నిలిచిన రవాణా

సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆదిలాబాద్‌ ఆర్టీసీ బస్‌డిపో ఎదుట కార్మిక సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులంతా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనటంతో డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. దీంతో ప్రయాణికులంతా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనలో సీపీఎం, తేదేపా నేతలతో పాటు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. బైంసా డిపో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బైంసా డిపో నుంచి తిరగాల్సిన 84 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. వివిధ గ్రామాల ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  మంచిర్యాల ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీంతో డిపో నుంచి బస్సులు కదల్లేదు. ఆర్టీసీ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెకు మద్దతుగా సీపీఐ నాయకులు డిపో ముందు బైఠాయించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి శంకర్‌, నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.  సార్వత్రిక సమ్మె ప్రభావంతో బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్సత్తికి తీవ్ర విఘాతం కలిగింది. సమ్మె ప్రభావంతో ఏరియాలోని గోలేటి 1ఏ, ఖైరుగూడ, డోర్లి 1,2 ఉపరితల ఘనుల్లో కార్మికులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. సమ్మె ప్రభావంతో సింగరేణి విభాగంలో కూడా కార్మికులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. దీంతో ఘనులు, విభాగాల ప్రాంతాలన్నీ వెలవెలబోతూ కనిపించాయి. ఈ సమ్మెకు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, తెలంగాణ బొగ్గు ఘని కార్మిక సంఘం, సీఐటీయూ, తదితర సంఘాలన్నీ మద్ధతు ప్రకటించాయి.

సంగారెడ్డిలో సీఐటీయూ నిరసన

సార్వత్రిక సమ్మెలో భాగంగా మెదక్‌జిల్లా సంగారెడ్డిలో సీఐటీయూ నాయకులు నిరసన తెలిపారు. బస్‌డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థలు, పరిశ్రమల వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ పారిశ్రామిక విభాగం జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా కార్మికులంతా సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయని వెల్లడించారు.

యాదాద్రిలో సమ్మె ప్రభావం

సార్వత్రిక సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో కార్మికులంతా ఆందోళనకు దిగారు. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. వివిధ కార్మికసంఘాలు సమ్మెలో పాల్గొనటంతో సమ్మె ప్రభావం అధికంగా ఉంది. బస్సులన్నీ నిలిచిపోవటంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఆటోలు, ప్రైవేటు వాహనాల కార్మికులు సైతం సమ్మెకు సంఘీభావం తెలపటంతో రవాణ వ్యవస్థ స్తంభించింది. సమ్మె కారణంగా యాదాద్రి ఆలయానికి భక్తుల రాక గణనీయంగా తగ్గింది.

సింగరేణిలో సమ్మె సంపూర్ణం

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు సమ్మెలో సంపూర్ణంగా పాల్గొన్నారు. రామగుండం ప్రాంతంలోని 1, 2, 3 ఏరియాలకు చెందిన కార్మికులు విధులకు హాజరుకాలేదు. సమ్మెకు పిలుపునిచ్చిన జాతీయ సంఘాలైనా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ సంఘాలతోపాటు తె.బొ.గ.కా.స, ఐఎఫ్‌టీయూ సంఘాల నాయకులు గనులపైకి చేరుకుని సమ్మెకు మద్దతు పలకాలని కోరారు. దీంతో కార్మికులు విధులను బహిష్కరించారు. రామగుండం ప్రాంతంలోని తొమ్మిది భూగర్భ, నాలుగు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే రామగుండం ఎన్టీపీసీ సంస్థలో దేశవ్యాప్త సమ్మె ప్రభావం కనిపించ లేదు. కార్మికులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎలాంటి నిరసనలు తెలుపకుండా పోలీసు బందోబస్తు చేపట్టారు. కార్మికులు, ఉద్యోగులు నిరసనలు తెలుపకుండా విధులకు హాజరుకావడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది.ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనటంతో గోదావరిఖని డిపోలో బస్సులు నిలిచిపోయాయి. హుస్నాబాద్‌ ఆర్టీసీ బస్సు డిపో ముందు సీపీఐ, ఎంప్లాయిస్‌ యూనియన్‌, టీఎంయూ కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో సీపీఐ మండల కార్యదర్శి సృజన్‌కుమార్‌, ఎంఎ/-లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు కేఎస్‌ చారి, టీఎంయూ కార్యదర్శి ఎంపీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సమ్మెతో మెట్‌పల్లి  ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచి విధులను బహిష్కరించి ఆర్టీసీ డిపో ఎదుట  ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో డిపో పరిధిలోని 62 బస్సులు నిలిచిపోయాయి. బస్సులు లేక బస్టాండ్‌ వెలవెలబోయింది. దీంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం మధిరలో వామపక్షాల ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక సాగర్‌ విశాంత్రి భవనం ఆవరణ వద్ద సీపీఎం, సీపీఐ ప్రాంతీయ నాయకులు లింగాల కమల్‌రాజు, మందడపు నాగేశ్వరరావు జెండా వూపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ వ్యవస్థలకు కొమ్ము కాస్తూ కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. నిరసన ప్రదర్శనలో కార్మిక సంఘాల బాధ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.  కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా

చింతకాని మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన తయారీ కార్మికులు కూడా సమ్మె బాట పట్టారు. ఈ సమ్మెతో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజనాల తయారీలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొన్ని పాఠశాలల్లో కూలీల ద్వారా, మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే మధ్యాహ్న భోజనం తయారుచేశారు. సార్వత్రిక సమ్మె పాల్వంచలో విజయవంతమైంది. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో కేటీపీఎస్‌, నవభారత్‌ ఫెర్రోఎల్లాయిస్‌, ఎన్‌ఎండీసీ కర్మాగారాల వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ… కార్మికులకు కనీస వేతనం రూ.15వేలు చెల్లించాలని, కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పోస్టాఫీస్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాలు మూతపడ్డాయి.