సింగరేణిలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

తెబొగకాసం విఫలం అయ్యిందంటున్న విపక్ష కార్మిక సంఘాలు

ఖమ్మం,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): సింగరేణిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గుర్తింపు సంఘం తెబొగకాసం గత నాలుగైదేళ్లుగా ఇక్కడి సమస్యలను పరిష్కరించలేదని, అలాగే సిఎం కెసిఆర్‌ వద్దకు సమస్యలను తీసుకుని వెళ్ల లేకపోయిందని వివిధ సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తెబొగకాసం కార్మికుల

సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని హెచ్చెమ్మెఎస్‌, ఏఐటీయూసీ,సిఐటియూ తదితర సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పడు ఎన్నికలు నిర్వహించే వేళ మళ్లీ కార్మికులను మోసం చేసేందుకు నేతలు వస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తెబొగకాసం కాలపరిమితి అయిపోయిందని, కనీసం సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోలేని పరిస్థితులో ఉండిపోయిందన్నారు. గత కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిపిస్తే మొదటి సంతకం వారసత్వ ఉద్యోగాల కోసం చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదన్నారు. ఇప్పుడు మరోసారి కార్మికులను మోసం చేసే ధోరణిలో ఉన్నారని విమర్శించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సింగరేణిని అభివృద్ధి చేసుకొంటామని తెబొగకాసం అధ్యక్షుడు బి.వెంకట్రావు పిలుపునిచ్చారు. తెబొగకాసం కార్మికులకు అనేక డిమాండ్లను సాధించిపెట్టిందని, మళ్లీ అధికారం ఇస్తే మరిన్ని హక్కులు తీసుకువస్తుందన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను సాధించే సత్తా తెబొగకాసంకే ఉందన్నారు. గత ఏడాది కంపెనీ సాధించిన లాభాల్లో 25 శాతం వాటా కార్మికులకు ఇవ్వడం, సొంతింటి పథకం అమలు, మెరుగైన క్యాడర్‌ స్కీం, నూతన గనుల ప్రారంభం, మెరుగైన కార్పొరేట్‌ వైద్య సదుపాయం, కార్మికులపై పనిభారం తగ్గించడం, గనుల్లో అత్యాధునిక రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయడం, యాక్టింగ్‌ చేస్తున్న కార్మికులకు పదోన్నతులు కల్పించడం తదితర హక్కులను సాధించేందుకు కార్మికులు తెబొగకాసంకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అయితే ఎన్నికలకు ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా జారీకాలేదు. మెడికల్‌ బోర్డుపై భూతద్దం పెట్టి చూడకడుండా అన్‌ఫిట్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిని అన్‌ఫిట్‌ చేయాలని హెచ్చెఎమ్మెస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ డిమాండ్‌ చేశారు. అనేక సమస్యలను ఇక్కడి సంఘాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వేతనాలలో 50శాతం పెరుగుదల ఉండే విధంగా ఒత్తిడి చేయనున్నట్లు తెలిపారు. వారసత్వ ఉద్యోగాలు రాకపోవడానికి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, తెబొగకాసం కారణమని ఆరోపించారు. కార్మికుల పక్షాన పోరాటాలు చేసే హెచ్చెమ్మెఎస్‌ను త్వరలో జరిగే కార్మిక సంఘాల్లో ఆదరించాలని కోరారు. గుర్తింపు సంఘంగా తెబొగకాసం నాలుగేళ్ల కాలంలో చేసిందేవిూ లేదని మరోసారి ఆ నాయకులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య కార్మికులకు సూచించారు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌తో గెలుపొందిన తెబొగకాసం కార్మికుల సమస్యలు పరిష్కరించ కుండా మోసం చేసిందన్నారు. అధికార దాహంతో అంతర్గత తగాదాలతో కాలయాపన చేసిన నేతలు కార్మికుల ముందకు వచ్చే అర్హత లేదన్నారు.