సింగరేణిలో వేడెక్కిన ప్రచారం

కార్మికులకు నేతల సందేశాలు

అధికార పార్టీకే మద్దతు కోసం మంతనాలు

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని కోల్‌బెల్టు ఏరియాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బీ వెంకట్రావ్‌, మిరియాల రాజిరెడ్డి ప్రకటించడంతో ఇప్పుడు కోల్‌బెల్ట్‌లో రాజకీయ వేడి అందుకుంది. ఎక్కడిక్డక కార్మికుల్లో ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. నిర్ణయాత్మక పాత్రలో కార్మికులు ఉన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారుకనుక మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ కోసం పోరాడిన కార్మిక సంఘాలకు కేసీఆర్‌ బాసటగా నిలిచారన్నారు. సకల జనుల సమ్మె జీతం, తెలంగాణ ఇంక్రిమెంట్‌, ఎనిమిదవ వేజ్‌బోర్డు వేతనాలను కార్మికులకు ఇప్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు.

టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో కార్మికులంతా ఐక్యంగా కలిసి పని చేసి తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రతిపాదించిన అభ్యర్థి జలగం వెంకటరావును గెలిపించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో కార్మిక సంఘాల నేతలు అధికార పార్టీ అభ్యర్తులకు మద్దతుగా నిలవనున్నారు.

సింగరేణి కార్మికులకు కరెంటు ఖర్చులను రద్దు చేయాలని ఎంతో కాలంగా యాజమాన్యానికి విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోతే కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని కార్మికులకు కరెంటు ఖర్చులు తగ్గించారన్నారు. కార్మికులకు చనిపోతే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించారని, కార్మికుల పక్షపాతి కేసీఆర్‌ అని అన్నారు. తండ్రీకొడుకుల ఉద్యోగాలు ఇప్పించేందుకు సీఎం కృషి చేస్తే జాతీయ కార్మిక సంఘాలు హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసి కారుణ్య నియామకాలను అడ్డుకున్నారని ఆరోపించారు. సీఎం చేసిన పనులే తెలంగాణలో అభ్యర్థుల విజయానికి దోహదపడతాయని అంటున్నారు.