సింగరేణి కార్మికులను ఆదుకున్న ఘనత కెసిఆర్‌ది


ఎన్ని కూటమిలు వచ్చినా గెలుపు టిఆర్‌ఎస్‌దే: ఎంపి
ఖమ్మం,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): సింగరేణి కార్మికులకు వరాలు కురిపించడంతో పాటు  లాభాల్లో అత్యధిక వాటాను ప్రకటించి ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దని  ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వర్గీయ ఎన్‌టీఆర్‌ ఆత్మ క్షోభించేలా టీడీపీ, కాంగ్రెస్‌లు అపవిత్ర పొత్తులతో ముందుకు వస్తున్నాయన్నారు. మాయ కూటమిలు ఆచరణ సాధ్యంకాని హావిూలతో ప్రజల ముందుకు వస్తున్నాయని, ఆపార్టీలు అధికారంలో ఉన్న చోట ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. అక్కడ అమలు పరిస్తే తెలంగాణ ప్రజలు నమ్మేవార న్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్‌ అన్నారు. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు వస్తాయని, 119 సీట్లలో 105 సీట్లు ప్రకటించారని, ఊహించని విధంగా అన్ని సర్వేల్లో ముందంజలో ఉన్నాయన్నారు. వందకు వందశాతం 100సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా ప్రజల దీవెనలు, మన్ననలు టీఆర్‌ఎస్‌ పార్టీకే  అన్నాయని అన్నారు.
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందజేస్తూ.. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఏడాదికి రూ. 1,26,000 ఖర్చు పెడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లను నియమించి కేసీఆర్‌ కిట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో 6శాతం డెలివరీలు పెరిగాయని, ఇది ఒక మంచి కార్యక్రమం అని అన్నారు. నిరుపేదలను సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్‌వోసీ ద్వారా కాపాడుతున్నాడన్నారు. ఆడబిడ్డల పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ పేరుతో రూ.1,00,116లు అందజేస్తున్నారని, ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలు చేసి సీఎం కేసీఆర్‌ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ఆసరా పథకంతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలను ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. అందుకే విపక్షాలు ఎన్ని కూటములు కలిసినా టీఆర్‌ఎస్‌దే గెలుపు అని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాలుగేళ్ళలో
ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గడప గడపకూ తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉన్నదన్నారు.