సిఆర్డిఎ కేటాయించిన భూములపై అస్పష్టత

వదులుకునేందుకు ఐఎఎస్‌ అధికారుల సిద్దం?
అమరావతి,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం దాదాపుగా స్పష్టతను ఇచ్చేసింది. విశాఖలోనే ఎగ్జిగ్యూటివ్‌ కాపిటల్‌ ఉండబోతున్నట్లు సీఎం జగన్‌ సహా పలువురు మంత్రులు, ఎంపీలు తేల్చేశారు. అయితే దీనిపై బోస్టన్‌ కన్‌స్టలెంట్‌ గ్రూపు రిపోర్ట్‌ వచ్చిన తరువాతే మాత్రం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేబినెట్‌ విూటింగ్‌ అనంతరం మంత్రి కురసాల కన్నబాబు స్పష్టతను ఇచ్చారు. ఇదిలా ఉంటే అమరావతిని రాజధానిగా ప్రకటించిన తరువాత ఐనవోలులో ఐఏఎస్‌ అధికారులకు ఇళ్ల స్థలాల కోసం సీఆర్డీఏ గతంలో భూములు కేటాయించింది. ఒక్కో అధికారికి సగటున 500 గజాల భూమిని అప్పటి సీఆర్డీఏ అధికారులు కేటాయించారు. దీనికి రూ.25ల చొప్పున ఐఏఎస్‌లు చెల్లించారు. ఇక ఈ భూములను కొనుగోలు చేసేందుకు చాలా మంది లోన్లు తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు నెల నెల ఈఐఎమ్‌లు కడుతున్నారు. ఆ తరువాత కొందరు తమ స్థలాలను అలానే ఉంచినప్పటికీ.. కొందరైతే ఇళ్లు కట్టడం కూడా ప్రారంభించేశారు. అయితే రాజధానిపై మొదట మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు వీరిలో కలకలం రేపాయి. దీంతో తమ భూములు పరిస్థితి ఏంటి..? తమ డబ్బుల మాటేంటని..? ఐఏఎస్‌లు చర్చించుకున్నారట. అయితే రాజధానిని మార్చనని ఎన్నికలకు ముందు గుంటూరులో జరిగిన ప్లీనరీలో సీఎం జగన్‌ హావిూ ఇచ్చారని, ఎవరూ అధైర్యపడవద్దని ఐఏఎస్‌ల గ్రూప్‌లో ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి భరోసా ఇచ్చారట. దీంతో అప్పటికీ వారు కాస్త సద్దుమణిగినప్పటికీ.. ఇప్పుడు రాజధాని మార్పు
దాదాపుగా ఖాయం అవ్వడంతో.. తమ భూములను అమ్ముకోవాలని వారు అనుకుంటున్నారట. తాము కొనుగోలు చేసిన రూ.25లక్షలకే తమ భూములను అమ్ముకోవాలని వారు అనుకుంటున్నారట. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి వారు వినతిని పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. వడ్డీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. తాము కొన్న రేటుకైనా తమ భూములను తీసుకోవాలని ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపేందుకు వారు సిద్ధమైనట్లు సమాచారం. మరి వీరి భూములపై జగన్‌ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.