సిఎం కెసిఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం

రాష్ట్ర అబివృద్దిలో భాగస్వాములం అవుతాం
బాధ్యతలు స్వీకరంచిన మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాసగౌడ్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా సీహెచ్‌ మల్లారెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా వి. శ్రీనివాస్‌ గౌడ్‌ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ… తమపై నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ బాధ్యతలను అప్పగించారన్నారు. అలాగే కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దిలో భగస్వామ్యం అవుతామని అన్నారు.  తనకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సచివాలయంలో కార్మిక, మహిళా-శిశు సంక్షేమశాఖల మంత్రిగా ఇవాళ ఆయన బాధ్యతలు చేపట్టారు.  తనకు ఇచ్చిన కార్మిక, ఉపాధి, మహిళా-శిశు సంక్షేమ శాఖలన్నింటిని సమర్థవంతంగా నిర్వహిస్తాను. యువతకు ఉపాధి కల్పిస్తాను.. కార్మికులకు న్యాయం చేస్తాను. కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రస్తుతం విజయవంతంగా అమలవుతోంది. దాన్ని మరింత సమర్థవంతంగా అమలుచేసేందుకు కృషి చేస్తాను. అందరిని కలుపుకొని ముందుకు సాగుతాను. నాకు కేటాయించిన శాఖలకు పూర్తిగా న్యాయం చేస్తానని మల్లారెడ్డి వివరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డికి ప్రజాప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు పనిచేస్తానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సచివాలయంలో ఎక్సైజ్‌, పర్యాటకశాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడారు. నూతన పథకాలతో సీఎం కేసీఆర్‌ చరిత్ర సృష్టిస్తున్నారు. ఆదాయాన్ని ఇచ్చే ఎక్సైజ్‌ శాఖను అప్పగించడం సంతోషం. దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలో అమల్లో ఉన్నాయి. ఇక్కడ బాధ్యతాయుతంగా పనిచేస్తున్న అధికారులు ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అక్రమ రవాణా, కల్తీ మద్యం లేకుండా చేశారు. ఆదాయాన్ని పెంచడానికి మరింత కృషి చేస్తాం. గత ప్రభుత్వాలు గీత కార్మికులను నిర్లక్ష్యం చేశాయి. తెలంగాణ రాగానే సీఎం గీత కార్మికులకు పెద్దపీట వేశారు. చనిపోయిన గీత కార్మికులకు రూ.6లక్షలు వచ్చేలా చేస్తున్నాం. అంగవైకల్యం అయిన వారికి కూడా రూ.6లక్షలు వచ్చేలా చేస్తున్నాం. పాలమూరు-రంగారెడ్డిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని సీఎం చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారుతాయి. టీఆర్‌ఎస్‌ 16 పార్లమెంట్‌ స్థానాలు గెలిస్తే ప్రధాన పాత్ర పోషించవచ్చు. దేశానికి ఆదర్శంగా ఇక్కడి ఉద్యోగులు పనిచేయాలని శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. పలువురు సచివాలయానికి వచ్చి మంత్రులను అభినందించారు.