సిఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన యడ్యూరప్ప

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్ష సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి తొలుత మాట్లాడారు. రైతుల ఇక్కట్లు, సాదకబాధకాలు తాను స్వయంగా వీక్షించానని, వారికి తగినంత చేయలేకపోయాననే బాధ తనకు ఉండేదని చెప్పారు. తాను సీఎం పగ్గాలు చేపట్టగానే వారికి ఎంతో చేయాలనే తపన కనబరిచానని అన్నారు. బీజేపీకే ప్రజలు పట్టం కట్టారని, 40 సీట్ల నుంచి 104 సీట్లకు ఎదగడం ద్వారా ప్రజలు తమకే పట్టం కట్టారని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్‌షా ఆశీర్వాదం వల్లే తాను సీఎం అయ్యానని అన్నారు. కర్ణాటకకు నిజాయితీ కలిగిన రాజకీయ నేతలే కావాలని, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఎంతో నమ్మకం ఉందని, కర్ణాటక ప్రజల పట్ల మోదీకి ఎంతో గౌరవం, వారికి ఎంతైనా చేయాలనే తపన ఉందని యడ్యూరప్ప చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని 28 సీట్లలో గెలిపిస్తానని ఆయన చెప్పారు. ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి గురయ్యారు. చివరగా…సంఖ్యాబలం నిరూపించుకోవడంలో తాను విఫలమయ్యానంటూ రాజీనామాను ప్రకటించారు.