సిపిఎస్‌ పెన్షన్‌ రద్దుచేయాలి

వరంగల్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): కేంద్రం అమలు చేస్తున్న సీపీఎస్‌ పెన్షన్‌ రద్దు చేయాలని ఆల్‌ ఇండియా టీచర్స్‌ ఆర్గనైజేషన్‌(ఏఐటీవో) డిమాండ్‌ చేసింది. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. దీనికోసం అవసరమైతే పోరాటాలు చేపడతామని నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టదాయకమైన కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్‌) ప్రభుత్వం రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని టీచర్‌ సంఘాలు స్పష్టం చేశారు. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారికి సీపీఎస్‌ విధానంవల్ల ఎంతో నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ దృష్ట్యా సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాతపింఛను విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీని కోసం అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి సంఘటిత పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులపై పనిభారం పెంచేసి తనిఖీల పేరుతో సెస్పెన్షన్లు విధించడం మంచి పద్ధతికాదని, ఇలాంటి విధానాలను విద్యాశాఖాధికారులు విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.