సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ

నేటి నుంచి పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు
నల్లగొండ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి విక్రయానికి వస్తుండడంతో ఈనెల 11  నుంచి సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.  సీసీఐ కొనుగోలు చేస్తున్న ప్పటికీ సంబంధించిన లెక్కలను మార్కెట్‌ అధికారులు నిరంతరంగా పర్యవేక్షించనున్నారు. మార్కెట్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ వ్యవస్థ ద్వారానే తక్‌ పట్టీలు, చెల్లింపులు జరుగనున్నాయి. జిన్నింగ్‌ మిల్లుల్లోని వేబ్రిడ్జిలను తూనికలు కొలతలశాఖ అధికారులతో తనిఖీ చేయించారు. మద్దతు ధరను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాణ్యత ప్రమాణాలపై కరపత్రాలను రూపొందించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నవంబరు నెలాఖరు వరకు పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 48,881 హెక్టార్లలో రైతులు పత్తిని సాగు చేశారు. ఎకరాకు సుమారు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా సుమారు 1,75,126.48 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత సీజన్‌లో 6,002 మంది రైతుల నుంచి 1.24 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు.  ఇప్పటికే అనేక చోట్ల  పత్తిని రైతులు బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకుంటున్నారు. మద్దతు ధర అధికంగా ఉన్నప్పటికీ ఖర్చులకు భయపడి రైతులు గ్రామాల్లోనే దళారులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలను జిన్నింగ్‌ మిల్లుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఐదు వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయాల పరిధిలో పది జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయి. మోత్కూరు మండలంలో నాలుగు, ఆలేరు పరిధిలో రెండు, భువనగిరిలో రెండు, చౌటుప్పల్‌లో ఒకటి, వలిగొండ పరిధిలో ఒక జిన్నింగ్‌ మిల్లు ఉంది. వాటిల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించి ఏర్పాట్లు చేస్తున్నారు.  జిల్లాలోని చౌటుప్పల్‌ మండలంలో అత్యధికంగా  పత్తిని సాగు చేశారు. ఈదఫా ప్రభుత్వం క్వింటా పెద్ద
పింజ రకం పత్తికి రూ.5,450, మధ్య రకానికి.. రూ.5,150 మద్దతు ధరను ప్రకటించింది.  తేమ కొలిచే యంత్రంలో ఈ సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేస్తారు. తేమ శాతాన్ని లెక్కించిన తరువాత ఆ వివరాలను నేరుగా బిల్లు వేసే కంప్యూటర్‌లో.. తరువాత ఆన్‌లైన్‌లో నిక్షిప్తం అవుతుంది. ఫలితంగా కొనుగోళ్లు పారదర్శకంగా జరిగి రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.