సిసిఐ కొనుగోళ్లు పెరగాలంటున్న రైతులు

ఆదిలాబాద్‌,నవంబర్‌18(జ‌నంసాక్షి): జిల్లాలో పత్తి దిగుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని ముందే తెలిసినా అందుకు అనుగుణంగా సిసిఐ రంగంలోకి దిగలేదని సిపిఐ నేతలు అన్నారు. తేమ విషయంలో మంత్రి హావిూ ఇచ్చినా కొనుగోళ్లు జరగడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శ కలవేన శంకర్‌ అన్నారు. జిల్లాలో రైతులు ఈ యేడు అత్యధికంగా పత్తి పంట సాగుచేశారు. గతేడాది కందులు వేసి నష్టపోయిన రైతులు మళ్లీ పత్తినే ఆశ్రయించడంతో దిగుబడి అధికం అయ్యిందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో రైతులు ఈసారి గతంలో కంటే ఎక్కువగా పత్తి పంటను సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 1,23,002 హెక్టార్లు కాగా, ఆ సారి 1,40,069 హెక్టార్లలో రైతులు పంటను వేశారు. గతేడాది చాలామంది రైతులు పత్తికి బదులు పప్పు దినుసుల పంటలను సాగు చేయగా కంది పంట కొనుగోళ్లలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఫలితంగా ఈ ఏడాది రైతులు పత్తి సాగువైపు మళ్లారు. ఫలితంగా ఈ సారి పంట దిగుబడులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉండడంతో కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేశామని చెప్పినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని శంకర్‌ అన్నారు. అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. సీసీఐ ద్వారా ఎక్కువ కేంద్రాలు ప్రారంభిస్తే రైతులకు మంచి ధర లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఆదిలాబాద్‌, బోథ్‌, ఇచ్చోడ, ఇంద్రవెల్లి మార్కెట్‌ యార్డులుండగా అదనంగా మరో ఆరు కేంద్రాల్లో సీసీఐ ద్వారా క్వింటాలుకు రూ.4320 ధరతో కొనుగోళ్లు జరుపనున్నారు. జిన్నింగ్‌ మిల్లు లు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుండడంతో ఎలాంటి సమస్య లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు చేసిన ప్రాంతాల్లో జిన్నింగ్‌ మిల్లులు ఉంటే పత్తిని మిల్లుకు తరలించి బేళ్లను తయారుచేసినా తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కేంద్రం ఈ సారి పత్తికి క్వింటాకు రూ.4320 కనీస మద్దతు ధర ప్రకటించగా.. జిల్లా వ్యాప్తంగా కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా కొనుగోలు చేస్తున్నారు.ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా పత్తి పంట ఎక్కువగా సాగైంది. దీంతో పత్తి ధర పడిపోవడంతో రైతులకు కనీస ధర ఇప్పించేందుకు ప్రభుత్వం కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా జిల్లాలో పత్తి కొనుగోళ్లను చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. పంట కొనుగోళ్ల సీజన్‌ ప్రారంభం నుంచి సీసీఐ కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉంటే మద్దతుధర లభిస్తుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్‌, బోథ్‌, ఇచ్చోడ, ఇంద్రవెల్లి మార్కెట్‌ యార్డులుండగా.. అదనంగా మరో నాలుగు కేంద్రాల్లో కొనుగోళ్లు జరుపనున్నారు. గత ఏడాది పత్తికి మంచి డిమాండ్‌ ఉండడంతో రైతులకు మంచి ధర లభించింది. గత సంవత్సరం కేంద్రం క్వింటాకు రూ.4160 ఎంఎస్‌పీ ప్రకటించగా ప్రైవేటు వ్యాపారులు క్వింటాకు రూ.5వేల వరకు చెల్లించారు. దీంతో సీసీఐ ద్వారా పంటను కొనుగోలు చేసే అవసరం లేకుండా పోయింది. జిల్లాలో పత్తి రైతులకు దళారుల బెడదను నివారించేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. లైసెన్స్‌లు కలిగిన వ్యా పారులు మార్కెట్‌యార్డుల్లోనే కొనుగోలు చేసేలా వారికి స్థలాన్ని కేటాయించనున్నారు.