సీఎం పదవి కూడా చిన్నమ్మకే?

5148189755_625x300చెన్నై :

ఇప్పటికే పార్టీ పగ్గాలను చిన్నమ్మకు అప్పగించిన అన్నాడీఎంకే వర్గాలు.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని కూడా ఆమెకే కట్టబెట్టాలని చూస్తున్నాయి. ఈ మేరకు సీనియర్ నాయకులు కొంతమంది కలిసి శశికళను కలిసి.. ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని కోరారు. జయలలిత మరణించిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సహా పలువురు సీనియర్ నాయకులకు వెళ్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాల్సిందిగా చిన్నమ్మను కోరారు. జీవితాంతం జయలలిత అదే పదవిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమ్మ లేరు కాబట్టి.. చిన్నమ్మ శశికళే ఈ బాధ్యతలు తీసుకోవాలని వాళ్లంతా కోరారు. అంతేకాదు, ఇప్పటికే చెన్నైలోని పలు ప్రాంతాల్లో శశికళ పేరు మీద పెద్దపెద్ద హోర్డింగులు కూడా వెలిశాయి.
మరోవైపు అన్నాడీఎంకేలోని ఒక విభాగమైన జయలలిత పెరవై.. శశికళ ఈ రెండు పదవులనూ చేపట్టాలని, ఇంతకుముందు జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుతూ ఒక తీర్మానం కూడా ఆమోదించింది. తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి, పెరవై సెక్రటరీ అయిన ఆర్‌బీ ఉదయకుమార్ ఈ మేరకు ‘తాయి తంట వరం’ (అమ్మ ఇచ్చిన వరమే చిన్నమ్మ) అనే శీర్షికతో ఉన్న తీర్మానం కాపీని శశికళకు అందించారు. సమాచార ప్రసార శాఖ మంత్రి కదంబూర్ రాజు, దేవాదాయ శాఖ మంత్రి సెవూర్ ఎస్. రామచంద్రన్, మరో 50 మంది పెరవై సభ్యులు అంతా ఉదయకుమర్‌తో సహా వెళ్లి శశికళను కలిసి వచ్చారు. గృహనిర్మాణ శాఖ మంత్రి, పార్టీ తిరుపూర్ రూరల్ జిల్లా కార్యదర్శి ఉడుమలై కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని పార్టీ కార్యకర్తలు కూడా ఇదే డిమాండ్ చేశారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడం ద్వారా కోటిన్నర మంది అన్నాడీఎంకే సభ్యులను, ముఖ్యమంత్రి పదవితో ఏడు కోట్ల మంది తమిళనాడు ప్రజలను కాపాడాల్సింది చిన్నమ్మను కోరామని రాధాకృష్ణన్ చెప్పారు. వీళ్లతో పాటు వివిధ జిల్లాకు చెందిన పలువురు మంత్రులు కూడా ఇదే తరహా తీర్మానాలు చేసి, వాటి కాపీలను శశికళకు అందించారు. జయలలిత నింసించిన పోయెస్‌ గార్డెన్స్ భవనంలోనే ఇప్పుడు శశికళ కూడా ఉంటున్నారు. ఆ భవనానికి ఇటీవలి కాలంలో సందర్శకుల రాకపోకలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్లో… ఎంజీఆర్ కాలం నుంచి మంత్రులుగా పనిచేసిన కొంతమంది సీనియర్లు శశికళను వ్యతిరేకించినట్లు కథనాలు వచ్చినా.. తర్వాత ఏమైందో గానీ వాళ్లు కూడా సమాధాన పడిపోయినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు అన్నాడీఎంకేలోని ఏ ఒక్కరూ శశికళను బహిరంగంగా వ్యతిరేకించలేదు. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో చిన్నమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయంగానే కనిపిస్తోంది.