సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు గ్రాట్యుటీ

రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ
హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం(సీపీఎస్‌)లో ఉన్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు గ్రాట్యుటీ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్మెంట్‌ గ్రాట్యుటీ, డెట్‌ గ్రాట్యుటీ వర్తింపు కానుంది. 2004, సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి గ్రాట్యుటీ వర్తింపు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ బుధవారం  ఉత్తర్వులు జారీ చేసింది. 2004 నుంచి పాత పెన్షన్‌ విధానం కోసం ఉద్యోగులు పోరాడుతున్న విషయం విదితమే. 2004, సెప్టెంబర్‌ 1 నుంచి అమలైన సీపీఎస్‌ విధానంలో భాగస్వాములైన 998 పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు, మరణించిన 263 మంది ఉద్యోగుల కుటుంబాలకు గ్రాట్యుటీ, డెత్‌ కమ్‌ రిటైర్మెంట్‌ గ్రాట్యుటీని చెల్లించనున్నారు.
పాత పెన్షన్‌కు వీరంతా అర్హులే..
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్‌-11, ఆర్టికల్‌-14 ప్రకారం ఈ ఉద్యోగులు పాతపెన్షన్‌ విధానానికి అర్హులవుతారని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం రూపొందించిన చట్టం ప్రకారం నూతన పెన్షన్‌ విధానం అమలులోకి వచ్చినప్పటికీ కేరళ, త్రిపురలో దీన్ని అమలు చేయడం లేదు. రిటైరయ్యే ఉద్యోగులకు ఆ రెండు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో గ్రాట్యుటీ చెల్లిస్తున్నారు. తెలంగాణ పరిధిలోని లక్షా 26వేల మంది ఉద్యోగులకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్పార్డీఏ)-2013 నిబంధనల ప్రకారం, ఉద్యోగుల మూలవేతనం, డీఏ నుంచి పదిశాతం తీసుకొని, దానికి రాష్ట్రప్రభుత్వం వాటా పదిశాతం కలిపి ప్రతీ ఉద్యోగి పేరిట నేషనల్‌ పెన్షన్‌ ట్రస్ట్‌ (ఎన్పీటీ)లో జమచేస్తున్నది. ఈ నిధులు నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ లిమిటెడ్‌ (ఎన్నెస్‌డీఎల్‌) ద్వారా షేర్‌మార్కెట్‌లోకి వెళ్తున్నాయి. ఎస్బీఐ, యూటీఎఫ్‌, ఎల్‌ఐసీ వంటి సంస్థలు ఈ షేర్‌మార్కెట్‌ వ్యాపారాన్ని చేస్తున్నాయి. ఇవి ఒడిదొడుకులకు లోనైతే తమ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని సీపీఎస్‌ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.