సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే

విజయవాడ,సెప్టెంబర్‌13(జనంసాక్షి): కాంట్రిబ్యూటరీ’పింఛను విధానం రద్దు చేయాల్సిందేనని   రాష్టోప్రాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు.  ఈ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేసేలా తాము శాయశక్తులా పోరాడుతున్నామని చెప్పారు. 2004 నుంచి రాష్ట్రంలో ఉద్యోగాల్లో చేరిన వారికి కాంట్రిబ్యూటరీ పింఛను విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.  ప్రత్యేక ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్‌ మంజూరులో జాప్యం తగదన్నారు. పీఆర్సీ బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం పంపిణీలో ప్రధానోపాధ్యాయుల పాత్ర లేకుండా చేసి నూతన విధానం అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కేటాయించేందుకు  నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.