సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు!

– సజ్జన్‌కుమార్‌ కేసులో నోటీసులిచ్చిన న్యాయస్థానం

– వివరణ ఇవ్వాలని సీబీఐకి ఆదేశం

న్యూఢిల్లీ, జనవరి14(జ‌నంసాక్షి) : సజ్జన్‌కుమార్‌ కేసులో సీబీఐకి సుప్రింకోర్టు నోటీసులిచ్చింది. సజ్జన్‌ పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రింకోర్టు వివరణ ఇవ్వాల్సిందిగా సీబీఐకి నోటీసులు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ మాజీ నేత సజ్జన్‌కుమార్‌ కు జీవితఖైదు పడిన విషయం విధితమే. తనను దోషిగా తేలుస్తూ గత నెల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సజ్జన్‌ డిసెంబరు 22న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం పరిశీలించింది. దీంతో సజ్జన్‌ పిటీషన్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా సీబీఐకి నోటీసులు జారీ చేసింది. సజ్జన్‌కుమార్‌ బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను పరిశీలించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. 1984 సిక్కుల ఊచకోత కేసులో సజ్జన్‌ను దోషిగా తేలుస్తూ ఢిల్లీ హైకోర్టు డిసెంబరు 17, 2018న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఆయన జీవించనంతకాలం జైల్లోనే ఉంచాలని తీర్పు చెప్పింది. తీర్పును అప్పీల్‌ చేస్తూ సజ్జన్‌ సుప్రీంకోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఆమె అంగరక్షకులు కాల్చి చంపారు. దీంతో దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. నవంబరు 1, 1984న రాజ్‌నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగుర్ని హత్య చేసి, పక్కనే ఉన్న గురుద్వారాకు నిప్పు పెట్టారన్న అభియోగాలు రుజువు కావడంతో సజ్జన్‌కు జీవిత ఖైదు విధించారు. ఈ కేసులో దోషులుగా తేలిన మరో ఇద్దరు మహీందర్‌యాదవ్‌, కిషన్‌ ఖోఖర్‌లకు పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ఈ కేసులో భాగంగానే శిక్ష పడిన సజ్జన్‌కుమార్‌ డిసెంబరు 31న దిల్లీ న్యాయస్థానంలో లొంగిపోయారు. ఆయనను పోలీసులు తూర్పు ఢిల్లీలోని మందోలి జైలుకు తరలించారు.