సీసీఈ విధానాన్ని రద్దు చేయాలి

వరంగల్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని విద్యాశాఖ సీసీఈ విధానాన్ని రద్దు చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తరగతి గదులకు పరిమితం చేయాలని పిఆర్టియూ నేతలు అన్నారు. ప్రభుత్వం మంచి పీఆర్‌సీ అందించటంతో పాటు, చైల్డ్‌కేర్‌ సెలవులు, ఆరోగ్య కార్డులు మంజూరు చేయటం పట్ల ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారిన సీపీఎస్‌ విధానాన్ని కూడా రద్దు చేయాలని కోరారు. దీనిపై అన్ని పార్టీలు స్పస్టత ఇవ్వాలని అన్నారు. సీసీఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకే పరిమితమై ఉండాలి. అప్పుడే విద్యార్థులకు చెప్పింది అర్థమవుతుంది. ఈవిధానంపై ఇంత వరకు ఉపాధ్యాయులకే సరైన స్పష్టత లేదన్నారు. విద్యార్థులు అంతర్జాలంపై ఆధారపడి డబ్బులు ఖర్చు చేసి సామగ్రి కొనుగోలు చేసి పుస్తకాలకు అంటిస్తున్నారని అన్నారు. దీని వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా తరగతి గదులకు దూరమవుతున్నారని చెప్పారు.