సుప్రీంను ఆశ్రయించిన కోల్‌కతా మాజీ పోలీస్‌ చీఫ్‌

న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : అరెస్టు నుంచి మరో ఏడు రోజుల పాటు రక్షణ కల్పించాలని కోరుతూ కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్‌లో న్యాయవాదులు సమ్మె చేస్తున్నందున.. అరెస్టు నుంచి కోర్టు తనకు కల్పించిన రక్షణను మరో వారం రోజులు పొడిగించాలని ఆయన కోరారు. శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో రాజీవ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేయరాదంటూ ఫిబ్రవరి 5న వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే గత తీర్పులో ఆయనకు అరెస్టు నుంచి కల్పించిన రక్షణను శుక్రవారం నుంచి ఏడు రోజుల పాటు సుప్రీం పొడిగించింది. బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించేందుకు కూడా అవకాశం కల్పించింది. దీంతో మరో వారం రోజుల పాటు రాజీవ్‌ కుమార్‌ను సీబీఐ అరెస్టు చేయజాలదంటూ ఆయన తరపు న్యాయవాది విూడియాకు పేర్కొన్నారు. కాగా శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో సిట్‌ బృందానికి నేతృత్వం వహించిన రాజీవ్‌ కుమార్‌.. ఈ కేసులోని ఆధారాలను మాయం చేశారంటూ సీబీఐ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.