సుప్రీం చీఫ్‌ జస్టిస్ట్‌పై అభిశంసన

రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీస్‌ ఇచ్చిన కాంగ్రెస్‌
లోయా తీర్పుతో వేగంగా పావులు కదిపిన హస్తం నేతలు
న్యూఢిల్లీ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను అభిశంసించాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనికి సంబంధించిన నోటీసును ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ ఎం. వెంకయ్య నాయుడుకు శుక్రవారం అందజేశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌  విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తాము భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ నోటీసు ఇచ్చామని తెలిపారు. ఈ నోటీసుపై 71 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు చెప్పారు. అయితే వీరిలో ఏడుగురి పదవీ కాలం ముగిసినందువల్ల ఈ నోటీసుపై సంతకాలు చేసినవారి సంఖ్య 64 అవుతుందన్నారు. తీర్మానాన్ని అనుమతించేందుకు అవరమైనదానికన్నా ఎక్కువ మద్దతు తమకు ఉందని, అందువల్ల రాజ్యసభ చైర్మన్‌ తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.  జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై 5 తీవ్ర ఆరోపణలతో ఈ నోటీసును ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ తెలిపారు. జస్టిస్‌ మిశ్రా తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. న్యాయ వ్యవస్థ దృఢంగా ఉంటేనే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందన్నారు. మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌ను సీజేఐ దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. తాము ప్రవేశపెడుతున్న తీర్మానానికి ఏడు పార్టీలు మద్దతిస్తున్నాయన్నారు. ఎన్‌సీపీ, ఎస్‌పీ, బీఎస్‌పీ. ముస్లిం లీగ్‌, వామపక్షాల ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలిపారు.సీజేఐపై అభిశంసన తీర్మానానికి అనుమతి లభించాలంటే 100 మంది లోక్‌సభ సభ్యులు కానీ, 50 మంది రాజ్యసభ సభ్యులు కానీ మద్దతివ్వాలి.  ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ నాయకులు పార్లమెంటులోని గులాంనబీ ఆజాద్‌ చాంబర్‌లో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సిబిఐ న్యాయమూర్తి బి.హెచ్‌ లోయా మృతిపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించటంపై చర్చించారు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే విషయంపై అన్ని పార్టీలను ఏకాభిప్రాయానికి వచ్చేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు  తెలిపారు. ఈ తీర్మానం పై వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయని, కొన్ని పార్టీలు సంతకాలు చేసి కూడా తిరిగి వెనక్కు వెళ్లాయిని అన్నారు. అలాగే ఈ సమావేశంలో ప్రతిపక్షాలు రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఎలా ఓడించాలనే అంశంపై విస్తృతంగా చర్చించారు.