సుప్రీం తీర్పు: నిర్భయ ఘటనలో నిందితులకు ఉరి

దేశాన్ని కుదిపేసిన నిర్భ‌య ఘ‌ట‌న‌పై సుప్రీంకోర్టు తీర్పును వెలువ‌రించింది. ఢిల్లీ  హైకోర్టు నిందితుల‌కు విధించిన మ‌ర‌ణ‌శిక్ష స‌రైన‌దేనంటూ సుప్రీం కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అక్ష‌య్, ప‌వ‌న్‌, వినయ్ శ‌ర్మ‌, ముఖేష్‌ల‌కు ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించ‌డంతో వారు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా, జ‌స్టిస్ ఆర్‌.భానుమ‌తి,జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌ల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం నిందితుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు కంటే ముందే ట్ర‌య‌ల్ కోర్టు నిందితుల‌కు ఉరిశిక్ష విధించింది. అయితే వీరు ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో అక్క‌డ వారికి నిరాశే ఎదురైంది.
కేసులో కీల‌కంగా ఉన్న మ‌రో నిందితుడు రామ్ సింగ్‌ శిక్ష అనుభ‌విస్తుండ‌గానే జైల్లోనే ఉరివేసుకుని చ‌నిపోయాడు. మ‌రో నిందితుడు అత్యాచార ఘ‌ట‌న జ‌రిగిన నాటికి మేజ‌ర్ కాక‌పోవ‌డంతో అత‌న్ని బాల‌నేర‌స్తుడిగా ప‌రిగ‌ణించి మూడేళ్ల పాటు జువైన‌ల్ హోమ్‌కు త‌ర‌లించింది. మూడేళ్ల పాటు శిక్ష అనుభ‌వించి డిసెంబ‌ర్ 20, 2015లో విడుద‌ల‌య్యాడు.

2012,డిసెంబ‌ర్ 16 రాత్రి స‌మ‌యంలో ద‌క్షిణ ఢిల్లీలో త‌న స్నేహితుడితో క‌లిసి నిర్భ‌య బ‌స్సు కోసం ఎదురు చూస్తుండ‌గా నిందితులు త‌మ బ‌స్సులో ఎక్కించుకున్నారు. నిర్భ‌య స్నేహితుడిని కొట్టి బ‌స్సులోనుంచి బ‌య‌ట‌కు తోసేశారు. అనంత‌రం నిర్భ‌య‌పై గ్యాంగ్‌రేప్‌కు పాల్ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఆమెను చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న నిర్భ‌య‌ను మెరుగైన చికిత్స కోసం సింగ‌పూర్‌కు త‌ర‌లించారు. అక్క‌డే చికిత్స పొందుతూ డిసెంబ‌ర్ 16న ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ ఘ‌ట‌న‌తో దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. దేశంలోని యువ‌త రోడ్డుపైకొచ్చి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వ‌హించ‌డంతో ఆనాటి యూపీఏ ప్ర‌భుత్వం దిగొచ్చింది. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా నిర్భ‌య పేరుతో ప్ర‌త్యేక చ‌ట్టాన్ని తీసుకొచ్చింది.

నిర్భ‌య ఘ‌ట‌న‌లో నిందితుల‌కు ఉరిశిక్ష ప‌డ‌టంతో దేశం సంబ‌రాలు చేసుకుంది. త‌మ‌కు న్యాయం జ‌రిగింద‌ని అన్నారు నిర్భ‌య త‌ల్లిదండ్రులు. క‌ష్ట‌కాలంలో త‌మ‌కు అండ‌గా నిలిచిన విద్యార్థులు, ప్ర‌జాప్ర‌తినిధులు, దేశ ప్ర‌జ‌ల‌కు వారు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.