సెప్టెంబరు 15 నుంచి.. 

ఆధార్‌ ‘ముఖ గుర్తింపు’
– టెలికాం సంస్థలతో ప్రారంభించనున్న ఉడాయ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు18(జ‌నం సాక్షి) : గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న ఆధార్‌ ముఖ గుర్తింపు(ఫేస్‌ రికగ్నిషన్‌) సదుపాయాన్ని ఎట్టకేలకు వచ్చే నెల నుంచి అమలు చేయాలని భారత విశిష్ఠ ప్రాధికార గుర్తింపు సంస్థ ఉడాయ్‌ నిర్ణయించింది. సెప్టెంబరు 15 నుంచి దశలవారీగా అందుబాటులోకి తెస్తామని ఉడాయ్‌ ప్రకటించింది. ముందుగా టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లతో ఈ ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఆధార్‌ కోసం ప్రస్తుతం ఐరిస్‌, వేలి ముద్రలను స్కాన్‌ చేస్తుండగా.. ఫేస్‌ రికగ్నిషన్‌కు కూడా జతచేయాలని గతేడాది ఉడాయ్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తొలుత జులై1 నుంచి ఈ ఫీచర్‌ను అమలుచేయాలని భావించింది. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని ఆగస్టు 1కి వాయిదా వేసింది. ఈ నెలలోనూ ఆధార్‌ ఫేస్‌ రికగ్నిషన్‌ ఫీచర్‌ అందుబాటులోకి రాలేదు. దీంతో తాజాగా సెప్టెంబరు 15 నుంచి దీన్ని అమలు చేస్తామని ఉడాయ్‌ స్పష్టం చేసింది. ఫింగర్‌ ప్రింట్‌తో కొన్ని ఇబ్బందులతో పాటు మోసాలు కూడా జరిగే అవకాశమున్నందున ఉడాయ్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఫింగర్‌ప్రింట్‌, ఐరిస్‌లతో ఆధార్‌ను ధ్రువీకరించేందుకు వీలులేని పక్షంలో ఈ ముఖ గుర్తింపు ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
దశలవారీగా ఈ ఫీచర్‌ను అమలు చేయాలని ఉడాయ్‌ నిర్ణయించింది. ముందుగా టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లతో ప్రారంభించనుంది. సెప్టెంబరు 15 నుంచి మొత్తం నెలవారీ లావాదేవీల్లో కనీసం 10శాతం ఫేస్‌ రికగ్నిషన్‌తో ధ్రువీకరించాలని ఉడాయ్‌ ఆదేశించింది. లేదంటే ఒక్కో లావాదేవీకు 20 పైసల చొప్పున వసూలు చేస్తామని స్పష్టం చేసింది.