సెలవులు విద్యార్థులకు మాత్రమే,ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాలి  …. డిఇవో గోవిందరాజులు

నాగర్కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి
 పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సోమవారం సాయంత్రం అందించిన ఆదేశాలను అనుసరించి నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ లు, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడులకు హాజరుకావాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి యం గోవిందరాజులు మంగళవారం ప్రకటనలో కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం నుంచి మార్చి 31 వరకు విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం సెలవులు ప్రకటించిందన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల సమయానికి విధులకు హాజరుకావాలన్నారు. ప్రధానోపాధ్యాయుల ఆదేశానుసారం పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. అభ్యసన ఫలితాలు సాధించేందుకు కావాల్సిన కృత్యాలను సంబంధిత పాఠ్యాంశాల్లో గుర్తించి తగిన బోధనోపకరణాలను తయారు చేయాలని సూచించారు. పాఠశాలల మౌలిక వసతులకు U-dise సంబంధించిన నమోదు కార్యక్రమాలతోపాటు, సీసీఈ మార్క్స్‌, ఎఫ్‌-3, 4లను వెబ్‌సైట్‌ పొందుపర్చాలన్నారు. ఎస్‌ఎంసీ సమాచారాన్ని టీ-హాజరులో నమోదు చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల హాజరును ప్రతి రోజు జిల్లా కార్యాలయంలో అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని ఉపాధ్యాయులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు గోవిందరాజులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాడే పత్రికా ప్రకటన ద్వారా అందరూ ఉపాధ్యాయులు స్థానికంగా ఉండాలని, జిల్లాలోని అందరు ఉపాధ్యాయులకు తెలియజేశామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.