సేంద్రియ వ్యవసాయంతో మేలు

సిద్దిపేట,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): రైతులు పాత వ్యవసాయ పద్ధతులతోనే ఖర్చులు పెట్టి ఆర్థికంగా నష్ట

పోవద్దని జిల్లా వ్యవసాయాధికారి సలహా ఇచ్చారు. నూతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ

వ్యవసాయం చేసి ఆధిక దిగుబడులు సాధించాలని కోరారు. రైతులకు సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడి వస్తుందన్నారు. బ్యాంక్‌ ఖాతాలను తీసుకోవాలని రైతులు పండించిన పంటలు అమ్మితే వచ్చే సోమ్ము నేరుగా తమ ఖాతాలో జమవుతుందని తెలిపారు. భూసార పరీక్షలు చేసుకొని ఆ భూమిలో ఏ పంట పండుతుందో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటసాగు చేసుకోవాలన్నారు. భూసార పరీక్షలతో రైతులకు ఎంతో జరుగుతుందని అన్నారు. మట్టి నమూనాను వేర్వేరుగా నీటి పారుదల, వర్షాధార పంటల కింద రెండు కేటగీరిలుగా విభజించామని తెలిపారు. రైతులు సేంద్రియ విధానంతో పంటలు సాగు చేస్తే ఆరోగ్యకరమైన పంటలు, ఆశించిన దిగుబడి వస్తుందని అన్నారు. రైతులకు అందుబాటులో ఉండే పేడ, ఆవుమూత్రం, మట్టి, నీరు, బెల్లంతో సేంద్రియ ఎరువులు తయారుచేసుకోవచ్చని సూచించారు. వాటి వాడకం వల్ల భూముల్లో సారం పెరిగి సూక్ష్మ జీవులు రెట్టింపు అయ్యే అవకాశముందన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో భాగంగానే భూరికార్డుల ప్రక్షాళణ చేపట్టిందన్నారు. అంతే కాకుండా ఎకరానికి రూ. 4 వేలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.గ్రామంలో ఉన్న రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రభుత్వానికి, రైతులకు మద్య వారధిలా పని చేయాలన్నారు. గ్రామాల్లోని రైతులందరూ ప్రధాన మంత్రి ఫసల్‌భీమా యోజన పథకంలో భీమా చేయాలన్నారు.. ఇందుకుగాను మిర్చి, జొన్న, వరి, వేరుశనగ డి సెంబర్‌ 31, మొక్కజొన్నకు డిసెంబర్‌ 15 చివరి తేదీ అని ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.