సేంద్రియ వ్యవసాయానికి చేయూత

బిందు సేద్యానికి మొగ్గుచూపుతున్న రైతులు

కామారెడ్డి,జూన్‌14(జ‌నం సాక్షి): జిల్లాలో పెద్ద ఎత్తున బిందు, తుంపర సేద్యం రైతులు అమితాసక్తి చూపుతున్నారు. గత ప్రభుత్వాలు ఈ సేద్యంపై అధిక సబ్సిడీ ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా భారీ సబ్సిడీని ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పోచారం సూచనలతో జిల్లాలో బిందు, తుంపర సేద్యంపై రైతులు మొగ్గు చూపుతున్నారు. అధికారులుకూడా ఈ వైపుగా ప్రోత్సాహం ఇస్తున్నారు.ఉన్న కొద్దిపాటి నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకునేందుకు ఈ పద్ధతులు సత్ఫలితాలు ఇస్తున్నాయి.తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తుండటంతో ప్రతి రైతు వీటి వినియోగానికి మొగ్గు చూపుతున్నాడు. రైతులకు లాభసాటిగా మారడంతో ప్రభుత్వం సబ్సిడీలను భారీగా ప్రకటిస్తోంది. దీంతో పంటల దిగుబడులు పెరగడంతో పాటు తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు అవకాశాలు రావడంతో రైతులు విరివిగా వినియోగిస్తున్నారు.తరిగిపోతున్న జలవనరులను అత్యంత పొదుపుగా వాడుకనేందుకు బిందు, తుంపర ఎంతో ప్రయోజనకరం. సిద్దిపేట ఖాళీ భూములు కనపడవద్దనీ మొత్తం డ్రిప్‌, తుంపర యం త్రాల సేద్యంతోనే వ్యవసాయం చేసుకునేలా చూడాలన్న మంత్రి హరీశ్‌రావు ఆశయాలకు అనుగణంగా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో జిల్లా లో గ్రామ గ్రామాన బిందు, తుంపర సేద్యం అమలు జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా డ్రిప్‌ అందిస్తుండగా, బీసీలైన సన్న, చిన్నకారు రైతులకు 90శాతం రాయితీపై డ్రిప్‌ను మంజూరు చేస్తున్నారు. ఇతర ఓసీ రైతులకు 80శాతం సబ్సీడీపై డ్రిప్‌ మం జూరు చేస్తున్నారు. ఒక్కో రైతులకు 12.50 ఎకరాలలోపు మాత్రమే డ్రిప్‌ను మంజూరు చేస్తారు. ఇక తుంపర సేద్యంకు ప్రతి రైతులకు 75 శాతం సబ్సీడీపై అందిస్తున్నారు.దీంతో జిల్లాలో రైతులు సాంప్రదాయ సాగుకు స్వస్తి పలుకుతూ డ్రిప్‌, తుంపర సేద్యం అమలుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా డ్రిప్‌తో మామిడి, జామ, దాని మ్మ, బత్తాయి, సపోట తదితర తోటలకు డ్రిప్‌ ను అమలు చేస్తుండగా, కూరగాయల సాగు తో పాటు మొక్కజొన్న, ఆరుతడి పంటగలకు తుంపర సేద్యం అమలు చేస్తున్నారు.