సైన్యం కాల్పుల్లో ఇద్దురు ఉగ్రవాదుల మృతి

అందులో ఒకరు సైన్యంలో పనిచేసిన వ్యక్తి

శ్రీనగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరిన భారత సైనికుడు భద్రతా సిబ్బంది కాల్పుల్లో మృతిచెందాడు. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా, వారిలో ఒకరు ఉగ్రవాదుల్లో చేరిన సైనికుడు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. షోపియాన్‌లోని జైనాపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతాబలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. దాగి ఉన్న ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌ జరిగిందని పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు తెలిపారు. వారు హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన వారని, గతంలో పలు చోట్ల భద్రతాసిబ్బందిపై జరిగిన దాడుల్లో వీరి ప్రమేయం ఉందని పోలీసు శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.మృతిచెందిన ఉగ్రవాదులను షోపియాన్‌కు చెందిన ఇద్రీస్‌ సుల్తాన్‌, ఆమిర్‌ హుస్సేన్‌లుగా గుర్తించారు. ఇద్రీస్‌ సుల్తాన్‌ గతంలో జమ్ముకశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేశాడు. తర్వాత సైన్యం నుంచి బయటకు వచ్చి ఉగ్రవాదుల్లో చేరాడు. అతడిని ఛోటా అబ్రార్‌ అని స్థానికంగా పిలుస్తారు. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతమంతా క్షుణ్ణంగా పరిశీలించే వరకు ఎవరూ అక్కడికి వెళ్లొద్దని, పేలుడు పదార్థాలు ఉండే ప్రమాదముందని పోలీసులు స్థానికులను హెచ్చరించారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.