సైబరాబాద్‌, రాచకొండ కవిూషనరేట్ల పరిధిల్లో.. 

పరిపూర్ణానందపై ఆరునెలల బహిష్కరణ
– హడావిడిగా ఉత్తర్వులు జారీ జారీ!
హైదరాబాద్‌, జులై12(జ‌నం సాక్షి) : హైదరాబాద్‌ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన పరిపూర్ణానంద స్వామి ని మరో రెండు కమిషనరేట్ల నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధి నుంచి కూడా పరిపూర్ణానందను బహిష్కరించారు. ఈ మేరకు పరిపూర్ణానందకు ఆయా కమిషనరేట్లు నోటీసులు జారీ చేశాయి. పరిపూర్ణానంద స్వామి ఆరు నెలల పాటు సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి రాకూడదని నోటీసులో పేర్కొన్నారు. పరిపూర్ణానంద
ఇటీవల కొన్ని సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు మత ఘర్షణలు రేకెత్తించే విధంగా ఉన్నాయని నోటీసులో తెలిపారు.   ఇదిలా ఉంటే నగర బహిష్కరణ ఎదుర్కొంటున్న శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద మళ్లీ హైదరాబాద్‌ వచ్చేందుకు సిద్ధమయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలలు హైదరాబాద్‌ నగర బహిష్కరణను పోలీసులు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన మళ్లీ హైదరాబాద్‌ వచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆయన టికెట్‌ రిజర్వ్‌ చేసుకున్నారు. తనపై బహిష్కరణ హైదరాబాద్‌ పరిధి వరకే పరిమితం కావడంతో సైబరాబాద్‌ పరిధిలో ఉండేందుకు ఆయన హైదరాబాద్‌ వస్తున్నట్టు తెలిసిందే. ఈ విషయమై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సైబరాబాద్‌,
రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోనూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలల బహిష్కరణ విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసి.. వాటిని పరిపూర్ణానందకు అందజేసేందుకు కాకినాడ బయలుదేరినట్టు సమాచారం. ఇదిలా ఉంటే హైదరాబాద్‌ నగరంతో పాటు మిగితా ప్రాంతాల్లో కూడా పరిపూర్ణానంద రాకపోకలపై నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు పోలీస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.