స్టీల్‌ప్లాంట్‌ సాధ్యం కాదని సుప్రింకోర్టుకు చెప్పలేదు 

ఏర్పాటు చేస్తామని అమిత్‌షా చెప్పారు
ఆ బాధ్యత కేంద్రానిదే
కేంద్రంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది
కడపలో స్టీల్‌ప్లాంట్‌ సాధ్యం కాదని రాష్ట్ర అధికారులు రిపోర్టు ఇచ్చారు
విలేకరుల సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
న్యూఢిల్లీ, జూన్‌14(జ‌నం సాక్షి) : కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పలేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే చట్టంలో ఉందని అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యం కాదని సెయిల్‌ రిపోర్టు ఇచ్చిందని.. అయినా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రధానిపై ఒత్తిడి తేవడంతో మేకాన్‌ సంస్థతో స్టడీ చేయించారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని అమిత్‌ షా చెప్పారని ఆయన పేర్కొన్నారు. కేంద్రంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కన్నా విమర్శించారు. మోసపూరిత చర్యలతో ప్రజల ముందు బీజేపీని దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగం చేస్తామన్న టీడీపీ నేతలు నాటకాలు ఆపాలంటూ హితవు పలికారు. ప్రజలను మోసం చేయడం ఆపి, ఇప్పుడైన నిజాలు చెప్పాలంటూ దుయ్యబట్టారు. పునర్విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇచ్చిందని కన్నా తెలిపారు. కానీ రాష్ట్ర అధికారులు కడపలో స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యం కాదని జూన్‌లో రిపోర్ట్‌ ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ అమిత్‌ షా కారణంగా పట్టుబడంతో మరోసారి పరిశీలించాలంటూ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారంటూ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, మెకాన్‌ సంస్థ కలిపి నివేదిక అందచేస్తే కేంద్రం కూడా త్వరలోనే ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన ఆర్డర్‌లో ఎక్కడా కూడా ప్లాంట్‌ సాధ్యపడదు అని చెప్పలేదని, ఈ విషయం కేంద్రం ఇచ్చిన ఆర్డర్‌లో స్పష్టంగా ఉందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తెలుగుదేశం నిరాధార ఆరోపణల కారణంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని విమర్శించారు. తెలుగుదేశం నేతలు ఎవరు స్టీల్‌ ప్లాంట్‌ కోసం ప్రాణ త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హావిూలకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కడపకు స్టీల్‌ ప్లాంట్‌ తీసుకువచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే నని కన్నా స్పష్టం చేశారు.