స్థానిక ఎన్నికల నిర్వహణలో వెనకడుగు

కారణాలు చెప్పలేకపోతున్న సర్కార్‌
అమరావతి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఎందుకనో వెనకాడుతోంది. గతంలో వీలయినంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఆరాటపడ్డ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం వెనకడుగు వేస్తోంది. కరోనా సమయంలో ఎన్నికలను వాయిదా వేయగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తప్పించారు. ఆ తరవాత అనేక కోర్టు కేసులు, తీర్పుల అనంతరం తిరిగి ఆయనను మళ్లీ కమిషనర్‌గా నియమించక తప్పలేదు. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభదశలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వాయిదా వేశారు. అప్పట్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కరోనా వైరస్‌ కాదు..కమ్మ వైరస్‌ అని స్పీకర్‌ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం సైతం వ్యాఖ్యానించారు. ఎన్నికలు వాయిదా వేయడంపై ఆగ్రహించిన జగన్‌ ప్రభుత్వం హడావుడిగా ఆర్డినెన్స్‌ జారీ చేసి మరీ రమేశ్‌ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించి, తమిళనాడుకు చెందిన జస్టిస్‌ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఈ కేసులో రమేశ్‌కుమార్‌ అంతిమ విజయం సాధించి తిరిగి తన పదవిని పొందారు. ఈ క్రమంలో తాజాగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ శుక్రవారం హైకోర్టులో విచారణకు రాగా.. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పుడు ఎన్నికలు జరపలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిపై ధర్మాసనం సహజంగానే అభ్యంతరం వ్యక్తంచేసింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పొరుగున ఉన్న తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. హైదరాబాద్‌ నగరపాలక సంస్థకు డిసెంబరు మొదటి వారంలో ఎన్నికలు జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి ప్రకటించారు. ఇవే అంశాలను హైకోర్టు ధర్మాసనం కూడా ప్రశ్నించింది. గతంలో వైరస్‌ లేదు.. ఏవిూ లేదు.. ఎన్నికలు వాయిదా వేయడం అన్యాయం అని విమర్శించిన ప్రభుత్వం, ఇప్పుడు దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కరోనా సాకు చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.