స్వచ్చ తెలంగాణకు సహకరించాలి

ఖమ్మం,జనవరి25(జ‌నంసాక్షి): ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ పేరుతో పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే ఇంటింట మరుగుదొడ్డి తప్పని సరి అవసరమని భావించిన ప్రభుత్వం ప్రతి ఒక్కరూ మరుగుదొడిడ నిర్మించుకునేందుకు చేయూతనందించింది. మరుగుదొడ్డు లేకపోతే బహిరంగ మలవిసర్జన ద్వారా ఎలాంటి నష్టాలు జరుగుతాయో ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేయకపోవడంతో అంటువ్యాధులు తప్పవని ప్రచారం చేపట్టారు. దీంతో ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మాణం చేయాలనే పట్టుదలతో చేపట్టిన మహాయజ్ఞం పూర్తయ్యిందని, అతి త్వరలోనే ఖమ్మం జిల్లాను ఓడీఎఫ్‌ జిల్లాగా ప్రకటిస్తామని జడ్పీ సీఈఓ ఎన్‌.నగేష్‌ తెలిపారు. మండలంలోని పాలేరులో మొత్తం 275 మరుగుదొడ్లు మంజూరు కాగా, వాటి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు, ప్రజలు స్వచ్ఛభారత్‌ ప్రతిజ్ఞ చేశారు. పరిశుభ్రత ఉండాలంటే ప్రతిఒక్కరు మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవాలన్నారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అని సూచించారు. రోగాలువస్తే వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్న మనం, ఆ రోగం రాకుండా చూసుకునే చర్యలు తీసుకోవడంలో అజాగ్రత్త

వహిస్తున్నామన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే, గ్రామంలో డ్రైనేజీ, మురుగు కాలువలు శుభ్రంగా ఉంచుకుంటే, ప్రతి ఇంటా మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలుంటే ఊరంతా పరిశుభ్రంగా ఉంటుందన్నారు. పాలేరు గ్రామాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించుకోవడం ఆనందంగా ఉందని, అలాగే మండలంలోని మిగిలిన గ్రామాల ప్రజలు మరుగుదొడ్లు నిర్మాణం కోసం కృషి చేసి ఓడీఎఫ్‌లను ప్రకటించాలని కోరారు.