స్వచ్ఛతను చేతల్లో చూపాలి

జనగామ,నవంబర్‌11(జ‌నంసాక్షి): వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. స్వచ్ఛత నినాదాలతో రాదని, ఆచరణలోనే చూపాలని అన్నారు. రాఘవపురం గ్రామ స్ఫూర్తితో ఇతర గ్రామాలు వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. /ూఘవపురంలో వందశాతం మరుగుదొడ్లు, సేద్యపు గుంతలు, ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా కృషి చేసిన సర్పంచ్‌ నల్లా నాగిరెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రాఘవపురాన్ని మరోగంగదేవిపల్లిలా తీర్చిదిద్ది జనగామ జిల్లాను ఆదర్శంగా నిలపాలని సూచించారు. తడిపొడి చెత్త విధానాన్ని గ్రామంలో అమలు చేయాలని సూచించారు. రాఘవపురం గ్రామాభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హావిూ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మిషన్‌ భగీరథ పథకం పనులు డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అద్భుత కార్యక్రమం చేపట్టలేదన్నారు. కొండపాక ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ల ద్వారా నీళ్లు అందించనున్నట్లు తెలిపారు.ఈపథకానికి ప్రభుత్వం రూ.840కోట్లు మంజూరు చేసిందన్నారు. పనుల్లో జనగామ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ట్యాంక్‌ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మిషన్‌ పనుల్లో రోడ్లు పాడైతే మరమ్మతులు చేపడతామన్నారు.