స్వచ్ఛ చైనాకు బిల్‌గేట్స్‌ మద్దతు

అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలసి వేదిక పంచుకున్న గేట్స్‌

మానవ మలంతో సభలో కలకలం సృష్టించిన దిగ్గజం

బీజింగ్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): చైనాలో పారిశుద్ధ్య విప్లవానికి మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మద్దతు తెలిపారు. అశుద్ధాన్ని ముందు పెట్టుకుని మాట్లాడారు. ప్రజలకు ఆరోగ్యం, తగినంత ఆహారం సమకూర్చడం ఎంత ముఖ్యమో పారిశుద్ధ్యం కల్పించడం అంతే ముఖ్యమని నొక్కిచెప్పారు. అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ చొరవ మేరకు చైనాలో మరుగుదొడ్ల విప్లవం చేపట్టారు. పెద్దఎత్తున పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. మురుగుపారుదలతో నిమిత్తం లేకుండా ఎక్కడికక్కడ మానవ వ్యర్థాలను శుద్ధిచేసే మరుగుదొడ్ల నిర్మాణం ప్రస్తుత చైనా టాయిలెట్‌ రివల్యూషన్‌లో ప్రధానాంశంగా ఉంది. దీనికి గేట్స్‌ తన ఫౌండేషన్‌ తరఫున సాయం అందిస్తున్నారు. పారిశుద్ధ్యంపై తన పాయింటు బలంగా వివరించేందుకు ఆయన పారదర్శకమైన సీసాలో మానవ వ్యర్థాన్ని వేదిక విూదకు తెచ్చారు. గేట్స్‌ ఇలా ప్రజల దృష్టిని సమస్యల విూదకు మళ్లించేందుకు గమ్మత్తయిన పని చేయడం ఇదే కొత్త కాదు. ఇదివరకు ఆయన ఓ సభలో హటాత్తుగా దోమలను తెచ్చి వదిలారు. సభలోని జనం దడుసుకున్నారు. అప్పుడాయన ఆ దోమలు రోగరహితమైనవని చెప్పి వారి భయం పోగొట్టారు. కానీ రోగాలు వ్యాపించే దోమల పనిపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తన ప్రసంగంలో ఉద్బోధించారు.