స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణ మరోమారు సత్తా

రాష్ట్రానికి నాలుగు అవార్డులు

ఇండోర్‌,జూన్‌23(జ‌నం సాక్షి): స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో తెలంగాణ మరోమారు సత్తాచాటింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డుల్లో.. రాష్ట్రానికి నాలుగు అవార్డులు దక్కాయి. ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్‌ ఉత్తమ, రాష్ట్ర రాజధానిగా ఎంపికైంది. అలాగే సౌత్‌జోన్‌ విభాగంలో రాష్ట్రానికి చెందిన సిద్దిపేట, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, మున్సిపాలిటి వివిధ విభాగాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు దక్కించుకున్నాయి. ఈ అవార్డులను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి ఇండోర్‌ వేదికగా అందుకున్నారు. పారిశుధ్య నిర్వహణలో ఉత్తమంగా నిలిచిన పట్టణాలు, నగరాలకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్‌-2018 అవార్డులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 4 వేల 41 నగరాలు, పట్టణాల్లో సర్వే నిర్వహించి ఈ అవార్డులను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఒక లక్ష అంతకన్నా ఎక్కువ జనాభా గల రాష్ట్ర రాజధానులను జాతీయస్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. ఇక 29 నగరాలు, కంటోన్మెంట్‌ బోర్డులకు జాతీయస్థాయి, మూడు రాష్టాల్రకు బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇన్‌ అర్బన్‌ ఏరియాస్‌ అవార్డులు ప్రకటించారు రాష్ట్ర రాజధానుల విభాగంలో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ హైదరాబాద్‌ నగరానికి బెస్ట్‌ స్టేట్‌ క్యాపిటల్‌ అవార్డు లభించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో.. జీహెచ్‌ఎంసీ ఘన వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన అనేక కార్యక్రమాల వల్లే .. ఈ అవార్డు దక్కింది. తడి, పొడి చెత్తను విడివిడిగా వేసేందుకు గానూ జీహెచ్‌ఎంసీ అధికారులు 22 లక్షల ఇళ్లకు ఇంటింటికీ రెండు చొప్పున 44 లక్షల చెత్త బుట్టలను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే 1,116 ప్రాంతాల్లో బహిరంగ చెత్త కుప్పలను తొలగించారు. తడిపొడి చెత్తను విడదీయాల్సిన అవశ్యకతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఫలితంగా గ్రేటర్‌ హైదరాబాద్‌కు బెస్ట్‌ సాలిడ్‌ వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డులభించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ బెస్ట్‌ క్లీనెస్ట్‌ సిటీ అవార్డుకు ఎంపికైంది. అలాగే ఎంపీ రాజధాని భోపాల్‌, పంజాబ్‌, హర్యానా ఉమ్మడి రాజధాని చంఢీగఢ్‌లు ద్వితీయ, తృతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ఇక లక్ష జనాభా విభాగంలో సౌత్‌జోన్‌కు సంబంధించి క్లీనెస్ట్‌ సిటీ అవార్డు మన రాష్టాన్రికి చెందిన సిద్దిపేటకు దక్కింది. బెస్ట్‌ సిటీ ఇన్‌ సిటిజన్స్‌ ఫీడ్‌బ్యాక్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ అవార్డులు బోడుప్పల్‌, పీర్జాదిగూడలకు లభించాయి.