స్వచ్ఛ స్ఫూర్తి నింపిన క్రికెట్ మ్యాచ్ లు

హైదరాబాద్‌ ఎల్ బి స్టేడియంలో స్వచ్ఛ క్రికెట్ మ్యాచ్ లు ఉత్సాహపూరితంగా జరిగాయి. జిహెచ్ఎంసీ కార్పోరేటర్లు, సినిమా తారల మధ్య జరిగిన రెండు టి20 మ్యాచ్ లో సినీ తారల జట్లే విజయం సాధించాయి. ఉదయం జరిగిన మ్యాచ్ లో మహిళా కార్పొరేటర్ల టీమ్‌ పై సినీ నటీమణుల జట్టు గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సినీతారల జట్టు 20 ఓవర్లలో 123 పరుగులు చేయగా, లక్ష్యాన్ని ఛేదించడంలో మహిళా కార్పొరేటర్లు విఫలమయ్యారు.

మధ్యాహ్నం నుంచి జరిగిన మ్యాచ్ లో పురుష కార్పొరేటర్ల టీమ్ పై సినీ నటుల జట్టు విజయం సాధించింది.

ముగింపు కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి క్రీడాకారులను అభినందించారు. వారికి ట్రోఫీలు అందించారు. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చిన సినీ తారలను ప్రశంసించారు.  హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా బుట్టల్లో వేసి స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజలకు సూచించారు. హైదరాబాద్ ప్రపంచంలోనే గొప్ప నగరమని సినీనటుడు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. స్ఫూర్తినిచ్చిన మహిళా కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. స్వచ్ఛతలో హైదరాబాద్ ను నెంబర్‌ వన్ చేస్తామని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు.

జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.