స్వచ్ఛ హైదరాబాద్‌

సరే స్వచ్ఛ తెలంగాణ మాటేంటి?మాహాత్మాగాంధీ కలలుగన్న స్వచ్ఛభారత్‌ రూపకల్పనకు కంకణబద్ధుడైన ప్రధాని మోదీ స్వచ్ఛభారత్‌ అభియాన్‌ పేరుతో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేయటం అభినందనీయం. కేంద్రం పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టడం ఆహ్వానించదగిన పరిణామం. ఇందులో భాగంగా స్వచ్ఛహైదరాబాద్‌ పేరుతో హైదరాబాద్‌ మహానగరాన్ని పారిశుద్ధ్యంలో నంబర్‌ వన్‌ క్లీన్‌ సిటీగా రూపొందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు కూడా. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. స్వచ్ఛ హైదరాబాద్‌ లోగోను, సీడీని కూడా ఆవిష్కరించారు. స్వచ్ఛ హైదరాబాద్‌ ద్వారా మన రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గవర్నర్‌, సీఎంలతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, నగరంలోని 425 యూనిట్ల మెంటర్లు/ప్యాట్రన్లు, ఉన్నతాధికారులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయా విభాగాలకు నియమితులైన మెంటర్లు/ప్యాట్రన్లు వారికి కేటాయించిన విభాగాలకు వెళ్లి అక్కడి పరిస్థితిని అంచనా వేసి, స్థానిక కాలనీవాసులు, స్వచ్ఛ యూనిట్‌ సభ్యులతో సమావేశమై స్వచ్ఛ హైదరాబాద్‌ అంశాలపై పూర్తిస్థాయిలో వివరిస్తారు. ఈ నెల 17 నుంచి పూర్తిస్థాయి స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంగా భారీఎత్తున నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా చెత్త, చెదారం, నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తారు. రోడ్లపై గుంతలు పూడ్చుతారు. మ్యాన్‌¬ల్స్‌ మూసివేస్తారు. డ్రెయిన్‌, ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు చేస్తారు. దీనితోపాటు చెత్త, చెదారాలు, నిర్మాణ వ్యర్థాలు తిరిగి పేరుకుపోకుండా ప్రజల ఆలోచనల సరళిలో మార్పు తెచ్చేలా చైతన్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ప్రతి ఇంటిలో చెత్తను సేంద్రియ, సేంద్రియేతర చెత్తగా ప్రజలే వేరు చేసేలా చైతన్యం తీసుకొస్తారు. ఇందుకోసం సుమారు 1.5 నుంచి 2 చదరపు కి.విూ.ల విస్తీర్ణంలో ఒక్కో యూనిట్‌ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్‌లో పారిశుధ్య కార్యక్రమాన్ని మెంటర్‌/పాట్రన్‌తోపాటు నోడల్‌ అధికారి, బిల్‌ కలెక్టర్‌, వాటర్‌ వర్క్స్‌ అధికారి, పోలీసు అధికారి, రెవెన్యూ అధికారి, విద్యుత్‌ శాఖ అధికారి, శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌, శానిటేషన్‌ వర్కర్‌తోపాటు స్థానికులైన 15 మంది ప్రముఖులు పర్యవేక్షిస్తారు. ఈ బృందంలోని ప్రతి ఒక్కరికి జాబ్‌చార్ట్‌ సిద్ధం చేశారు. వారి వారి శాఖలకు సంబంధించి స్వచ్ఛ టీం నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆయా శాఖల యంత్రాంగంతో కలిసి చర్యలు తీసుకుంటారు. దీనికి తోడు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులనుకూడా తీసుకుని పరిష్కరిస్తారు. ఇదంతా చెప్పుకోవటానికి బాగానే అనిపిస్తోంది. స్వచ్చభారత్‌ పేరుతో ఇటీవల రోడ్లపై సెలెబ్రిటీలు హడావిడి చేస్తున్న దృశ్యాలు తరచుగా చూస్తున్నాం. అయితే నిజంగా స్వచ్ఛభారత్‌ తయారుకావడానికి సెలెబ్రిటీలు, రాజకీయనాయకులు ఫోటోలకు ఫోజులిస్తే సరిపోతుందా. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా స్వచ్ఛభారత్‌ లాంటి కార్యక్రమాలకు సాక్షాత్తూ ప్రధాని పిలుపునిచ్చే దుస్థితిలో మనం ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనా దేశంలోని ప్రతి నగరం, పల్లె పరిశుభ్రంగా ఉండాలని ఓ కార్యక్రమానికి స్వీకారం చుట్టాం. అయితే ఇందుకోసం ఫోటోలకు ఫోజులిచ్చే కార్యక్రమాలకు స్వస్తి పలికి అసలైన కార్యాచరణ చేపట్టాలి. నిజానికి పారిశుద్ద రంగానికి చెందిన కార్మికులను నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. పారిశుద్ధ కార్మికులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మలమూత్రాలు ఎత్తిపోస్తూ..జనానికి మెరుగైన జీవనం అందిస్తున్నారు. కానీ వారి పట్ల అడుగడుగునా నిర్లక్ష్యం. ఊరు నిద్ర లేవక మునుపే పారిశుద్ధ కార్మికులు లేచి మురికి కాల్వలు, రోడ్లు శుభ్రం చేయటం,చెత్త ఎత్తటం, మానవీయ శుద్ధి చేపట్టడం ఇలా అన్ని పనులు చేస్తూ పరిశుభ్రతకు దోహదపడుతున్నారు. వారిపట్ల చులకనభావనే కాక కనీస వేతనాలు కూడా వారికి అందించలేని పరిస్థితుల్లో సర్కారు సార్లు కొట్టుమిట్టాడుతున్నరు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ”స్వచ్ఛ్‌ భారత్‌” కార్యక్రమం పైకి నిగనిగలాడుతూ సెలబ్రిటీలతో సందడిగా సాగుతున్నా.. ఉత్తుత్తి హడావుడి తప్ప… స్వచ్ఛ్‌ భారత్‌ ద్వారా దేశాన్ని ఉద్ధరిస్తున్నది… పరిసరాలను పరిశుభ్రంగా మార్చేస్తున్నది మాత్రం అంతంతే. ప్రముఖులు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభించటం, ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ అంతా మామూలే. ఆ పరిసరాల్లో యథావిధిగా చెత్త పేరుకొంటోంది. రోజులు గడిచే కొద్దీ.. మళ్లీ దుర్గంధం వ్యాప్తిస్తోంది. స్వచ్ఛ భారత్‌ ప్రచారం కోసం ఖర్చు పెడ్తున్న సొమ్మును పారిశుద్ధ కార్మికుల జీతభత్యాల కోసం, పారిశుద్ధ యంత్రాల కోసం  వెచ్చించి ఉంటే.. మున్సిపాలిటీలకు… కార్పొరేషన్లకు.. అధునాతన పారిశుద్ధ యంత్రాలను కొనుగోలు చేసేందుకు వినియోగించి ఉంటే… దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండేవి. అయినా పాలకులకు ప్రజా ప్రయోజనాలకన్నా. ప్రచారం పట్లనే ఎక్కువ శ్రద్ధ కదా! ఏదేమైనా సరైన ప్రణాళికలతో అందుబాట్లో ఉన్న నిధుల్ని సరైన రీతిలో ఖర్చు చేస్తే ఫలితం ఉంటుంది. నగరాల్లో, పట్టణాల్లో ప్రధానంగా ఉండే సమస్య సరైన టాయిలెట్‌ సౌకర్యాలు లేకపోవడం. భారత దేశంలో పబ్లిక్‌ టాయిలెట్లు సరిపడా ఉన్న నగరం ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం సిగ్గు చేటు. స్వచ్చభారత్‌ కోసం దాదాపు 4000కు పైగా పట్టణాల్ని ఎంపిక చేస్తే అందులో ఏ ఒక్క నగరంలోనూ పారిశుద్యం సరైన రీతిలో లేదు. నగరాల్లో పరిస్థితి ఇలా ఉంటే పల్లెల్లో కూడా పారిశుద్ధ నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. పల్లెల్లో నివసిస్తున్న వారిలో 60 శాతం మందికి కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పల్లెల్లో పంచాయితీల ఆధ్వర్యంలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనాలు కూడా లేక నిర్లక్ష్యపు నీలినీడలు అలుముకున్నాయి. ఇప్పటికైనా కేవలం ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాకుండా యావత్‌ తెలంగాణలో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసముంది. ముఖ్యంగా పల్లెల్లోని పాఠశాలల్లో నేటికీ సరైన మరుగుదొడ్డి సౌకర్యం లేక అమ్మాయిలు నానా అవస్థలు పడుతూ తమ సమస్య ఎవరికి చెప్పుఓకోవాలో తెలియక నలిగిపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సర్కారు మరుగుదొడ్లు విరివిగా కట్టించేందుకు నిధులు ఖర్చుచేస్తున్నామని చెప్తున్నా ఆచరణలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. అన్ని స్థాయిల్లో చిత్తశుద్ధి ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. అంతే తప్ప ఏదో ఎన్నికల కోసం తూతూ మంత్రంగా స్వచ్ఛ కార్యక్రమాన్ని చేపట్టి చేతులు దులుపుకుంటే లక్ష్యాన్ని సాధించలేమని గుర్తెరగాలి. హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల స్టంట్‌ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టాలంటే మరింత చిత్తశుద్ధితో కేవలం హైదరాబాద్‌లోనే కాక తెలంగాణ అంతటా స్వచ్ఛత కార్యక్రమం చేపట్టాల్సిన అవసరముంది. తద్వారా లక్ష్యాన్ని సాధించి బంగారు తెలంగాణ కల సాకారం చేసుకోనే అవకాశం ఉంటుంది.