స్వర్ణవాగుపై చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం

సాగునీటి సమస్య లేకుండా చర్యలు

నిర్మల్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): సాగునీటికి కొరత రాకుండా స్వర్ణవాగుపై 11చెక్‌డ్యాం నిర్మాణాలు చేపడుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మూడింటిని పూర్తి చేశామన్నారు. 15వ ఆర్థిక సంఘం, ఉపాధి నిధులు ఉపయోగించి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం చేపట్టిందన్నారు. పల్లె పచ్చని చెట్లతో కళకళ లాడాలని ఈ మేరకు అందరి సహకారం అవసరమన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. గ్రామంలో తుప్పుపట్టిన, వంగిన స్తంభాలను తొలగించి కొత్తవాటిని అమర్చుతున్నట్లు తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం 500 జనాభా కలిగి ఉన్న ప్రతీ గ్రామానికి రూ.8లక్షల చొప్పున నిధులు మంజూరు చేయుటకు ప్రభుత్వం రూ.350 కోట్లు విడుదల చేయనున్నదని తెలిపారు. ఎస్సారెస్పీ పునరావాస గ్రామమైన న్యూలోలం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం తప్పనిసరన్నారు. పంచాయతీ భవన నిర్మాణానికి మరిన్ని నిధులు, వీవో భవననిర్మాణానికి సైతం నిధులు అందజేస్తామని మంత్రి ప్రకటించారు.