స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి,జనవరి30(జ‌నంసాక్షి): దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం అతి స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 1 పాయింటు నష్టపోయి 35,591వద్ద, నిఫ్టీ 0.4 పాయింట్లు నష్టపోయి 10,651 వద్ద ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైన మార్కెట్లు అమెరికా ఫెడ్‌ సమావేశ భయాలతో నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు 5.3శాతం , టాటా స్టీల్‌ షేర్‌ 5.14శాతం లాభపడ్డాయి. బజాజ్‌ ఆటో, కొటక్‌ మహీంద్రా షేర్లు 2.5శాతానికి పైగా కుంగాయి. దేవాన్‌ హౌసింగ్‌ షేర్లు దాదాపు 10శాతం నష్టపోయాయి. గత 35 నెలల్లో ఈషేరు ధర ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లు, ఆసియా ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. దీంతోపాటు అమెరికా-చైనా మధ్య జరుగుతున్న చర్చలు ఫలితాలపై నెలకొన్న ఆందోళన దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. మరోపక్క చమురు ధరలు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి.