స్వామి పరిపూర్ణానందపై.. 

బహిష్కరణ ఎత్తివేయాలి
– నగరంలో భాజపా, భజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ ఆందోళన
హైదరాబాద్‌, జులై19(జ‌నం సాక్షి) : శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై విధించిన నగర బహిష్కరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ భాజపా, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ గురువారం హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టాయి. నగరంలోని ఆరాంఘర్‌ కూడలిలో భజరంగ్‌దళ్‌, భాజపా, వీహెచ్‌పీ శ్రేణులు ధర్నా చేపట్టారు. కూడలి వద్ద కార్యకర్తలు భైఠాయించడంతో నలువైపులా రెండు కిలోవిూటర్ల వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అందోళనకారులను అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ పోలీసులు రాకపోకలను చక్కదిద్దడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. అవిూర్‌పేట మైత్రివనం వద్ద కార్యకర్తలు రాస్తోరోకో నిర్వహించి రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది. ఎస్సార్‌నగర్‌ పోలీసులు అక్కడికి చేరుకుని అందోళనకారులను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ముందు జాగ్రత్తగా కొన్ని వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. కోఠి కూడలిలో విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వారిని బలవతంగా అరెస్టు చేసి సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ పీఎస్‌ ముందు వీహెచ్‌పీ నాయకులు ధర్నా నిర్వహించారు. స్వావిూజీని బహిష్కరించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం హిందూ సమాజాన్ని తీవ్రంగా అవమానించిందని వీహెచ్‌పీ నాయకులు పేర్కొన్నారు. స్వావిూజీపై విధించిన బహిష్కరణను బేషరతుగా ఉపహరించుకోవాలని… రాష్ట్ర ప్రభుత్వం స్వావిూజీకి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి ఆయన్ని రాష్ట్రంలోకి ఆహ్వానించాలని డిమాండ్‌ చేశారు.