స్వేరోస్‌ జోలికొస్తే ఊరుకోం !!

-రాజ్‌న్యూస్‌ కథనాలపై మండిపడ్డ స్వేరోస్‌
-మనువాద భావజాలంతోనే బురద చల్లే ప్రయత్నం
-కిందికులాలు ఎదిగితే ఎందుకింత కడుపుమంట
-రాజ్‌న్యూస్‌ను బ్యాన్‌ చేయాలంటున్న స్వేరో నాయకులు
”పెట్టుబడికి, కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు పత్రికలు” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. మీడియా అంటే ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్థంభం. కానీ, ఇండియాలో మాత్రం మీడియా మాఫియాలా తయారైంది. అగ్రకులాల జేబు సంస్థలుగా, రాజకీయ పార్టీల తోకలుగా మీడియా మారి దళిత, బహుజన కులాలపై దండయాత్ర చేస్తోందని స్వేరోస్‌ నాయకులు అన్నారు. తాజాగా రాజ్‌ న్యూస్‌ అనే ఛానల్‌ గురుకులాల్లో స్వేరోస్‌ పెత్తనం ఎక్కువైందని, స్వేరోస్‌ను రెసిడెన్షియల్స్‌లోకి రానివ్వద్దని ఒక కథనాన్ని ప్రచారం చేసింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ప్రసారం చేసిన ఈ కథనం పై స్వేరోస్‌ నాయకత్వం ఒక్కసారిగా మండిపడింది. ఇట్లా రాజ్‌న్యూస్‌ చేస్తున్న విష ప్రచారానికి కారణం మనువాద బ్రాహ్మణీయ భావజాలమేనని స్వేరో నాయకులు ధ్వజమెత్తారు. ఇటీవల గురుకులాలు బాగు పడుతున్నాయంటే అది గురుకులాల ప్రిన్సిపాల్‌ సెక్రటరీ డా.ఆర్‌.ఎస్‌. ప్రవీన్‌ కుమార్‌ ప్రత్యేక శ్రద్ధయే కారణం. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అగ్రవర్ణ మీడియా ఆయనపై బురద జల్లి, ఆయనను మరో శాఖకు మార్చాలని విపరీతంగా ప్రయత్నం చేసింది. కానీ, ప్రవీన్‌ కుమార్‌ నిజాయితీ, అంకితభావాన్ని గుర్తించిన సర్కార్‌ అందుకు సాహసం చేయలేదు.
ఎస్సీఎస్టీబీసీ మైనారిటీ విద్యార్థుల డ్రాప్‌ ఔట్స్‌ నాలుగు దశాబ్దాల క్రితం విపరీతంగా ఉండేవి. ఇది గమనించిన అప్పటి ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఎస్‌.ఆర్‌.శంకరన్‌ గురుకులాల పద్ధతిని ప్రవేశపెట్టారు. దాంతో వేలాది మంది ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టలల్లో చదివి దేశం గర్వించే ప్రయోజకులుగా మారారు. అలాంటి సాంఘిక సంక్షేమ గురుకులాల్లోనే చదివి ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఎదిగిన వ్యక్తే డా.ఆర్‌.ఎస్‌.ప్రవీన్‌ కుమార్‌. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సూచించిన ‘పే బ్యాక్‌ టు ది సొసైటీ’ కాన్సెప్టును గుండెల నిండా నింపుకున్నాడు. తాను ఎదిగడానికి అండగా నిలిచిన హాస్టల్ల దీనవస్థ చూసి చలించిపోయాడు. తనవంతుగా ఆ హాస్టల్లను బాగు చేయాలని భావించాడు. అట్లా గురుకులాలకు ప్రిన్సిపాల్‌ సెక్రటరీగా నియమించబడ్డాక, తన ఆశయాలకు మరింత పదును పెట్టారు. ఆయన కఠోర శ్రమ వల్ల సాంఘిక సంక్షేమ హాస్టల్ల తలరాత పూర్తిగా మారింది. గతంలో ఎన్నడూ చూడని గుణాత్మక మార్పులెన్నో నేడు సంభవించాయి. ఆయన అలుపెరగని కృషి చూసి, ఆయన స్ఫూర్తితో అందులో చదివిన మరింత మంది ఆయన ఆశయ సాధనకు జతయ్యారు. ఆ ఆర్గనైజేషన్‌ పేరే స్వేరోస్‌ (సోషల్‌ వెల్ఫేర్‌ ఆరోస్‌).
హాస్టల్లను బాగు పరుచుకొని, తమ వంతుగా ఇప్పుడు హాస్టల్లలో చదువుతున్న విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి స్వేరోస్‌ చేస్తున్న కృషి అసామాన్యమైంది. ఈ విషయం నేషనల్‌ మీడియా ఏనాడో కోడై కూసింది. స్వేరోస్‌ ఆవిర్భవించిన తరువాత హాస్టల్‌ విద్యార్థుల్లో కొండంత ఆత్మవిశ్వాసం ఏర్పడింది. దేన్నైనా సాధిస్తామనే పట్టుదల పెరిగింది. అందుకే రిజల్ట్స్‌ కూడా ఊహించని స్థాయిలో పెరిగాయి.
రెసిడెన్షియల్స్‌ సాధించిన విజయాలు:
ప్రపంచం తలతిప్పి చూసేలా స్వేరోస్‌ ఎన్నో ఘన విజయాలు సాధించారు. కార్పోరేట్‌ కాలేజీలకు సైతం సాధ్యంకాని ఎవరెస్ట్‌ శిఖరాన్ని అత్యంత వెనుకబడిన ఎస్సీఎస్టీ సామాజిక వర్గ విద్యార్థులు అధిరోహించారు. పదమూడేళ్లకే ఎవరెస్ట్‌ను ఎక్కి ఘనత సాధించి వరల్డ్‌ రికార్డ్‌ సాధించిన మాలవత్‌ పూర్ణ స్వేరోస్‌ అందించిన ఆణిముత్యమే. అట్లాగే తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకునే వారి కడుపున పుట్టిన నిరుపేద దళిత విద్యార్థి ఆనంద కూడా పూర్ణతో పాటుగా ఎవరెస్ట్‌ను ఎక్కాడు. అంతేకాదు. గురుకులాల్లో ఒకనాడున్న దైన్యపరిస్థితులు ఇవాళ లేవు. మంచి వసతులు, నాణ్యమైన విద్యా బోధన, బంగారు భవిష్యత్తును అందించే అత్యుత్తమ నైపుణ్యాలు ఇవాళ స్వేరోస్‌కు నేర్పించబడుతున్నాయి. బోధనలో అనేక మార్పులు చేశారు. ఉపాధ్యాయుల్లో అలసత్వానికి చెక్‌ పెట్టి వందకు వంద శాతం రిజల్ట్స్‌ వచ్చేలా మారింది పరిస్థితి. ఇక దేశ వ్యాప్త పోటీ పరీక్షల్లో సైతం స్వేరోస్‌ తమ సత్తాని చాటుతున్నారు. నీట్‌, ఎంసెట్‌, అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాకు సైతం స్వేరోస్‌ ఎంపికవుతున్నారు. ఇదంతా తెలియని రాజ్‌ న్యూస్‌ కేవలం నిందలు మోపడానికి సిద్ధమయ్యింది.
కార్పోరేటు సంస్థలకు దీటుగా రెసిడెన్షియల్స్‌:
ఒకనాడు హాస్టల్స్‌లో చదువు అంటే తల్లిదండ్రులు విద్యార్థులు భయపడేవారు. అక్కడ ఉండే అరకొర వసతులు, నాసిరకం విద్యతో బెంబేలెత్తేవారు. ఇవాళ రెసిడెన్షియల్‌ హాస్టల్లలో సీట్ల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. గురుకులాల్లో సీటు రావడం అంత ఈజీ కాదనే పరిస్థితులు తలెత్తాయి. ఒకరకంగా ఈ పోటీ కార్పోరేటు విద్యా సంస్థల కంటే ఎన్నో రెట్లు ఎక్కువుంది అనడం అతిశయోక్తి కాదు. పేద, మధ్య తరగతికి చెందిన బడుగు, బలహీన వర్గాలకు గురుకులాలు ఒక వరంగా మారాయి.
రాజ్‌ న్యూస్‌ను బ్యాన్‌ చెయ్యాలి:
మనువాద బ్రాహ్మణీయ భావజాలంతో స్వేరోస్‌ మీద తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న రాజ్‌న్యూస్‌ను నిషేధించాలని స్వేరోస్‌ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు సంయుక్తంగా ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కిందికులాలకు చదువు ఉండొద్దా ? వారు బాగుపడుతుంటే అగ్రవర్ణ మీడియాకు ఎందుకింత కంటగింపు? స్వేరోస్‌ ఆషామాషీగా లేదు. రాజ్‌న్యూస్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పకుంటే దాని యాజమాన్యంపైన ప్రత్యక్ష కార్యచరణకు స్వేరోస్‌ పిలుపునిచ్చి ఆందోళనలు నిర్వహిస్తామని స్వేరోస్‌ నాయకత్వం అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఏమి రాసినా చెల్లుతుందనుకుంటే పొరపాటు, ఇది వెనుకటి కాలం కాదు, మోసపోవడానికి సిద్ధంగా లేమని వారి స్పష్టం చేశారు. తెలంగాణలోని ముప్పయొకటి జిల్లాల్లో స్వేరోస్‌ నాయకత్వం రాజ్‌ న్యూస్‌ తప్పుడు కథనాల మీద మండిపడుతోంది. స్వేరోస్‌ సాధిస్తున్న విజయాలు మింగుడు పడకనే కొంతమంది రాజకీయనాయకులు ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని స్వేరోస్‌ నాయకత్వం అభిప్రాయపడింది.