స్వైన్‌ ఫ్లూని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండండి 

ఖమ్మంబ్యూరో,అక్టొబర్‌6(జనంసాక్షి)
చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో అతివేగంగా ప్రబలే స్వైన్‌ ఫ్లూని సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా వైద్యాధికారులు సిద్దంగా ఉండాలని వైద్య విధాన పరిషత్‌ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ జయరాం రెడ్డి ఆదేశించారు. కమిషనర్‌ మాణిక్యరాజ్‌ ఆదేశానుసారం జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రికి వచ్చిన ఆయన వైద్యాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శీతాకాలంసమీపిస్తున్నందున జిల్లాలో స్వైన్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కిందటేడాది ఒకట్రెండు మరణాలు సంభవించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వైన్‌ ఫ్లూ వ్యాప్తిపై ముందస్తుగానే జిల్లా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కర పత్రాలు, కళాజాత కార్యక్రమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఒక వేళ స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైన పక్షంలో జిల్లా ప్రధానాసుపత్రిలో వారికి ప్రత్యేకమైన వార్డును కేటాయించి చికిత్స అందించే విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని చెప్పారు. మగ, ఆడ వారికి వేర్వేరుగా గదులను కేటాయించాలన్నారు. అలాగే స్వైన్‌ ఫ్లూ మందులను ముందుగానే తెప్పించుకుని సిద్దంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన చిన్న పిల్లల వైద్యులతో సమావేశమై మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. మాతా, శిశు మరణాలను గణనీయంగా తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి.వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో కృపా ఉషశ్రీ, డాక్టర్లు పవన్‌, సురేందర్‌, సౌమ్య, నర్సింగ్‌ సూపరింటెండ్‌ సుగుణ, హెడ్‌ నర్సులు పాల్గన్నారు.