హక్కుల పరిరక్షణకు సుప్రీం పూచీ!

రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన స్వేచ్చను హరించేలా ఉన్న చట్ట సవరణను భారత సర్వోన్నత న్యాయస్థానం అడ్డంగా కొట్టేసింది. పౌరులకుండే సమాచార హక్కులకు భంగం కలిగిస్తున్న సమాచార సాంకేతిక పరిజ్ఞాన(ఐటీ) చట్టంలోని 66ఏ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కరాఖండీగా తేల్చేసింది. తాజా పరిణామాలు, సంఘటనల గురించి ఇంటర్‌నెట్‌లో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక అనుసంధాన వేదికలపై నేటితరం తమ భావోద్వేగాలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకుంటోంది. 2000 సంవత్సరంలో రూపొందించిన ఐటీ చట్టానికి 2008లో చేసిన సవరణ ద్వారా అమలులోకి వచ్చిన 66ఏ నిబంధన అనేక విధాలుగా అస్పష్టంగా ఉంది. ఇటీవల కాలంలో ఈ చట్టం బాగా దుర్వినియోగమవుతోంది. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ పౌరులకు అందించిన భావప్రకటన స్వేచ్ఛకు విఘాతంగా మారిన 66ఏ నిబంధనను రద్దు చెయ్యాలని కోరుతూ సుప్రీంకోర్టులో తొమ్మిది ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందన్న ఒకే ఒక్క కారణంతో దాన్ని కొట్టేయడం తగదంటూ కేంద్రప్రభుత్వం వాదించినప్పటికీ, దేశ విదేశీ న్యాయ నిర్ణయాల్ని ఏకరువు పెడుతూ సుప్రీం ద్విసభ్య బెంచ్‌ ఐటీ చట్టంలోని 66వ నిబంధనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అయితే ఇంటర్‌నెట్‌లో ప్రమాదకర పోకడల్ని ఉపేక్షించజాలమన్న సర్కారు వాదనల్లోని హేతుబద్ధతను మన్నిస్తూ- దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వెబ్‌సైట్లను నిషేధించే అధికారం కేంద్రానికి ఉందని తీర్మానించింది. 66ఏ నిబంధన దుర్వినియోగం కాకుండా కాచుకొంటామన్న హామీ తదనంతర ప్రభుత్వాలకు శిరోధార్యం కాదంటూ, ఆ వివాదాస్పద నిబంధన మంచి చెడుల్ని 122 పేజీల తీర్పులో వివరించిన సుప్రీంకోర్టు- భావ ప్రకటన స్వేచ్ఛకు మరో రక్షరేకు తొడిగింది. ఈ చరిత్రాత్మక తీర్పును కాంగ్రెస్‌, భాజపాలు రెండూ స్వాగతించడం గమనార్హం.

ఎక్కడైనా ఎప్పుడైనా ‘స్వేచ్ఛ’కు అర్థం విచ్చలవిడితనమో, విశృంఖలత్వమో కానే కాదు. 19(1)(ఎ) అధికరణ ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛకు భరోసా ఇచ్చిన భారత రాజ్యాంగం- 19(2) ద్వారా ఏయే సందర్భాల్లో ఆ స్వేచ్ఛకు సహేతుక ఆంక్షలు విధించగల వీలుందో విస్పష్టంగా ప్రకటించింది. దేశ సమగ్రత సార్వభౌమత్వం, దేశభద్రత, విదేశాలతో మైత్రీబంధాలు, శాంతిభద్రతలు, నైతిక వర్తన, కోర్టు ధిక్కారం, నేరానికి పురిగొల్పడం, పరువునష్టం వంటి కీలకాంశాల్లో వ్యక్తిస్వేచ్ఛను హేతుబద్ధంగా నియంత్రించే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టింది. ఐటీ చట్టంలోని 66ఏ- రాజ్యాంగంలోని ఈ 19(2) అధికరణ కిందా చెల్లుబాటయ్యేది కాదని సుప్రీంకోర్టు గట్టిగా తీర్మానించడానికి, ఈ మధ్యకాలంలోనే చోటుచేసుకొన్న ఎన్నెన్నో అరాచకాలు దోహదపడ్డాయి. మహారాష్ట్రలో బాల్‌థాకరే అంత్యక్రియల రోజున ముంబయి మొత్తం ‘బంద్‌’ కావడంపై ఫేస్‌బుక్‌లో తమ మనోభావాలు పంచుకున్న ఇద్దరమ్మాయిల మీద 66ఏ కింద కేసులు బనాయించి నిర్బంధించడం గగ్గోలు పుట్టించింది. పూర్తిగా నేరపూరితమైన లేదా భయాందోళనలు పెంచే ఏ సమాచార ప్రసరణమైనా, ఎవరినైనా సతాయించడానికో, అసౌకర్యం కలిగించడానికో, అవమానించడానికో తప్పుడు సమాచారం పంపినా, తప్పుడు ఈ మెయిల్‌ చిరునామాలతో ఇబ్బంది పెడుతూ మోసగించాలని చూసినా- 66ఏ ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష జరిమానా విధించగల వీలుంది. పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వ్యంగ్య చిత్రాల్ని మిత్రులతో పంచుకొన్నందుకు ప్రొఫెసర్‌ అంబికేష్‌ మహాపాత్రపైనా, మహారాష్ట్రలో కార్టూనిస్టు అసీమ్‌ త్రివేది మీదా, నాటి కేంద్రమంత్రి చిదంబరం తనయుడి మీద ఆరోపణలు చేసిన ఓ వ్యాపారవేత్త పైనా అడ్డగోలుగా 66ఏ కింద కేసులు పెట్టి వేధింపులకు గురిచెయ్యడం సంచలనం సృష్టించింది. ఇప్పుడా పాశవిక చటాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా సుప్రీం తేల్చిపారేయడంతో స్వేఛ్చకు తిరిగి ఊపిరొచ్చింది. ‘దేశవ్యాప్తంగా న్యాయస్థానాలన్నీ భావప్రకటన స్వేచ్ఛకు గొడుగు పట్టాలి. దాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వాలు చేసే చట్టాల్ని, చర్యల్ని తోసిపుచ్చడం వాటి ప్రాథమిక విధి’- అని మూడు దశాబ్దాల క్రితమే సుప్రీం స్పష్టం చేసింది.

‘ప్రభుత్వ యంత్రాంగాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. హింసను ప్రేరేపించినట్లయితేనే ప్రభుత్వం ఎవరిమీదనైనా రాజద్రోహం కేసు పెట్టే వీలుంది కదా’ అని బాంబే హైకోర్టు ఇటీవలే స్పష్టీకరించింది. 2011లో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఆందోళన జరిపినప్పుడు రాజ్యాంగంపై వ్యంగ్య చిత్రాలు గీసి పంచిపెట్టాడంటూ అసీమ్‌ త్రివేదిపై మహారాష్ట్ర ప్రభుత్వం- 66ఏతోపాటు రాజద్రోహం కేసునూ బనాయించింది. ‘పౌరుల స్వేచ్ఛను అణగదొక్కేందుకు భారతీయ శిక్షాస్మృతిలో కొలువైన పాశవిక నిబంధనల్లో అత్యంత కీలకమైనది’గా మహాత్మాగాంధీ పేర్కొన్న 124ఏ (రాజద్రోహం) అధికరణను- ఏళ్ల తరబడి పాటించిన బ్రిటన్‌ ఆరేళ్ల క్రితం తన రాజ్యాంగంనుంచి తొలగించింది. నాటి వలస పాలకుల చట్టాలకు ఊతమిస్తూ రూపొందిన 66ఏ వంటివి అమాయకులైన రేపటి పౌరుల భవితను బలిగొంటున్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లో సమాజ్‌వాది నాయకుడు అజమ్‌ఖాన్‌పై ఓ పందొమ్మిదేళ్ల పిల్లాడు ఫేస్‌బుక్‌లో ‘అభ్యంతరకర వ్యాఖ్య’ పెట్టాడంటూ- భిన్న మతవర్గాల మధ్య శత్రుత్వం పెంచడం సహా పలు సెక్షన్ల కింద మొన్న పద్దెనిమిదో తేదీన కేసు బనాయించారు. 66ఏ కింద కేసుల నమోదుకు కేంద్రం వెలువరించిన మార్గదర్శకాల్ని పట్టించుకునే నాథుడు లేడు. సైబర్‌ నేరాలు, యుద్ధాల నియంత్రణపై శక్తియుక్తులు కేంద్రీకరించాల్సిన ప్రభుత్వాలు- పిచ్చుకలపై బ్రహ్మాస్త్రంలా 66ఏను ప్రయోగించబట్టే ‘సుప్రీం’ ఆ నిబంధనకు పాతరేసింది. అందుకే యావత్‌ భరత జాతి సుప్రీం జిందాబాద్‌ అంటున్నది.