హరితంతోనే నల్లగొండ ఉష్ణోగ్రతలకు చెక్‌

నిరంతరం మొక్కలు నాటాల్సిందే

తక్షణం స్పందింకుంటే భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు

నల్గొండ,జూలై18(జ‌నం సాక్షి): జిల్లాలో అధికంగా కొండలు, గుట్టలు, వివిధ రకాల గ్రానైట్‌ రాళ్లు కలిగిన భూములు ఉండటం వల్లనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఏటేటా పెరుగుతన్నాయని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. దీనికి పచ్చదనం పెంచడంతో పాటు విరివిగా మొక్కుల పెంచాలని, అలాగే భూర్భజలాలలను పెంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు. నల్గొండ, భువనగిరి, దేవరకొండ ప్రాంతాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వీటితో వేసవిలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాపై భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే సెగలు మొదలవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు కారణాలనేకమని అంటున్నారు. జిల్లాలో ముఖ్యంగా అటవీ శాతం తక్కువగా ఉండడం వల్లనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా జిల్లాల్లో పర్యావరణ విపత్తులు తలెత్తుతున్నాయి. వర్షపాతం తగ్గుతోంది. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. రాబోయేకాలంలో అనేక కష్టాలు ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని అధిగమించడానికి యుద్దప్రాతిపదికన, శాస్త్రీయంగా మొక్కుల పెంచాల్సి ఉందన్నారు. కొండలు గుట్టలపై మొక్కలు పెంచడంతో పాటు, బోర్ల తవ్వకాలపై నిషేధం విధించాలని అంటున్నారు. దీనికితోడు అడవులు లేకపోవడం, ఇక్కడ మొక్కల పెంపకంపై శ్రద్ద లేకపోవడం వల్ల కూడా ప్రభావం తీవ్రంగా ఉంటోంది. మరోవైపు ప్లాస్టిక్‌ వాడకం వల్ల కూడా ప్రభావం పెరుగుతోందన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగేందుకు మరో కారణం కృష్ణపట్టి ప్రాంతంలో నాపరాయి, సిమెంట్‌కు అవసరమయ్యే ఖనిజపు రాళ్లతో భూములు విస్తరించి ఉన్నాయి.ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో ఎడారి ఛాయలు కనిపిస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. పరిస్థితులు ఇలానే ఉంటే క్రమంగా అన్ని ప్రాంతాలు ఉష్ణ మండలంగా మారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే చెట్లను అధికంగా పెంచడం, ఇంకుడు గుంతల ద్వారా నీటిని భూగర్భంలోకి పంపించడం. బోర్ల సంఖ్యను తగ్గించడం వంటి పలు సూచనలు చేసినప్పటికీ అవి సక్రమంగా పాటించడం లేదు. వాస్తవానికి భూ విస్తీర్ణంలో 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలి. జిల్లాలో కేవలం 5.88 శాతం మాత్రమే ఉండటం ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నాయి. తెలంగాణలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి మూడేళ్ల నుంచి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. హరితహారంలో ఆశించిన మేరకు మొక్కల పెంపకం జరగడం లేదు. నాటినవి సరైన సంరక్షణ లేక చనిపోతున్నాయి. ఈ పథకానికి ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు వివిధ శాఖల కింద సుమారు రూ.పది కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకాన్ని విజయవంతంచేస్తే ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.

ఇకపోతే కాంక్రీట్‌ నిర్మాణాలు కూడా పెరుగుతన్నాయి. పట్టణాలకే పరిమితమైన సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాలకు వ్యాపించాయి. ఒకప్పుడు మే చివరి మాసం నుంచి తొలకరి వర్షాలు కురిసేవి. మూడేళ్ల నుంచి పరిశీలిస్తే జూన్‌ చివరి వరకు కూడా వరుణదేవుడు కరుణించడంలేదు. ఇలా సగటు వర్షపాతం క్రమంగా తగ్గుతోంది. దీంతో చెరువులు, కుంటల్లో నీరు లేక ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. వేడి ప్రభావాన్ని అడ్డుకునేందుకు పొలాల మధ్య ఖాళీ స్థలాల్లో చెట్లను పెంచాల్సి ఉన్నా రైతులు వాటిని పట్టించుకోవడం లేదు. సేంద్రియ వ్యవసాయాన్ని వదిలేయడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలవల్ల వ్యవసాయంపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని అధికారులు కోరుతున్నారు. జి/-లలాలో ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు నిత్యం మొక్కల పెంపకం సాగాలన్నారు.