హరితహారంలో అందరూ పాల్గొనాలి

అటవీ అధికారి వినతి

ఆదిలాబాద్‌,జూలై19(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా అధికారులు, ప్రజలు నాటిన మొక్క రక్షణ బాధ్యత కూడ తీసుకోవాలని జిల్లా అటవీ అధికారి దామోదర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగో హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో లక్ష్యానికి మించి మొక్కలను నాటి జిల్లాకే ఆదర్శంగా నిలవాలన్నారు.హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. వదిలేస్తే ఖర్చు వృథా అవుతుందన్నారు. అధికారులు వివిధ కార్యాలయాల్లో, ప్రజలు ఇళ్లలో, విద్యార్థులు పాఠశాలల్లో, నాయకులు గ్రామాల్లోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడంతో పాటు, వాటికి రక్షణ కంచెలను ఏర్పాటు చేయాలని కోరారు. నాటిని మొక్కలను రక్షించినప్పుడే హరితహారం విజయవంతమవుతుందని గుర్తు చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రక్షణ కంచెలను అందుబాటులో ఉన్నాయన్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించనున్నామని తెలిపారు. ఈ మొక్కలకు రక్షణ కంచెలను ఏర్పాటు చేయడంతో పాటు, వాటి రక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని అటవీ సిబ్బందికి ఆదేశించారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం

చేయాలని పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి ఇంటి వద్ద ఐదు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతోనే లక్ష్యాన్ని అధిగమించవచ్చునన్నారు. మొక్కలు అవసరం ఉన్నవారు గ్రామంచాయితీ కార్యాలయంలో సంప్రదించి, అందుబాటులో ఉన్న మొక్కలను తీసుకెళ్లాలని సూచించారు. పోలంగట్లపై మొక్కలను నాటాలని తోటి రైతులకు మొక్కలను అందజేయాలన్నారు.