హరితహారం మొక్కలకు పక్కాగా లెక్కలుండాలి

సర్పంచ్‌లను బాధ్యులను చేసి ముందుకు సాగాలి

పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లుచేసుకోండి

అధికారులకు కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచన

మెదక్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  హరితహారం కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ప్రతి మొక్కకు లెక్క ఉండాల్సిందేనని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. గ్రామంలో ప్రతి ఇంటికి అవసరం ఉన్న మొక్కలను సర్వే చేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లపై ఉందని కలెక్టర్‌ చెప్పారు. శనివారం జిల్లా కార్యాలయంలోని సమావేశ మందిరంలో హరితహారం కార్యక్రమంపై మండల ప్రత్యేకాధికారులు, మండల అభివృద్ది అధికారులు, ఏపీఓలు ఇతర అధికారులతో కలెక్టర్‌ అధ్యక్షతన సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొక్కల సంరక్షణలో ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శితోపాటు, సర్పంచ్‌ని భాగస్వాములు చేయాలని అధికారులకు సూచించారు. మొక్కుబడిగా మొక్కలను నాటితే కుదరదని, పంపిణీ చేసిన మొక్కలతో పాటు, నాటిన ప్రతిమొక్క లెక్కలోనికి రావాలన్నారు. ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. గ్రామంలో ఏ ప్రదేశంలో మొక్కలు నాటితే బతుకుతుందో ముందుగా అంచనా వేసి మొక్కలను నాటాలన్నారు.  నర్సరీ ఏర్పాటుకు ముందుగానే అన్ని గ్రామాల్లో సర్వే జరిపి ప్రజలకు అవసరమైన మొక్కలను సిద్దం చేసేందుకు ప్రణాళికలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికి కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న నర్సరీల్లో అటవీ భూభాగంలో నాటేందుకు అనువైన విత్తనాలు ఎందుకు సిద్దం చేయలేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. ప్రతి నర్సరీల్లో అల్లనేరడి, రేగి, ఇప్ప, సీతాఫలం, మొర్రి, రాగి, మారేడు, ఈత, జీడి, ఖర్జూరతో పాటు మర్రి విత్తనాలను తప్పకుండా ఉంచేలా చూడాలన్నారు. ఈ రకమైన మొక్కలను అటవీ భూభాగంలో నాటితే అడవుల్లో ఉండే పక్షులు, జంతువులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. అలాగే ప్రతిగ్రామ పంచాయతీలో లక్ష మొక్కల నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో 70శాతం వరకు గ్రామాల్లోనే నాటడం జరుగుతుందన్నారు. ఏ ఒక్కరికి బలవంతంగా మొక్కలను పంపిణీ చేయకూడదని, తప్పకుండా నాటి సంరక్షించే వారికి మొక్కలను పంపిణీ చేయాలన్నారు. ప్రతి మండల ప్రత్యేకాధికారి ప్రతి బుధవారం తప్పకుండా మండల పర్యటనలు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో నర్సరీలను, అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించడంతో పాటు సంబంధిత అధికారులతో సవిూక్షలు నిర్వహించి హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన చెప్పారు. మెదక్‌ జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని సౌకర్యాలను సమకూర్చుకోవాలని సూచించారు. ప్రతిపోలింగ్‌ స్టేషన్‌లో సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ప్రతి మండలంలో డిస్టిబ్యూష్రన్‌ అండ్‌ రిసెప్షన్‌ సెంటర్‌ల ఏర్పాటుతో పాటు కౌంటింగ్‌ నిర్వహించే ప్రదేశాలను ఎంపిక చేయాలని, కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రావిూణాభివృద్ది అధికారి సీతారామారావు, జడ్పీ డిప్యూటీ సీఈఓ లక్ష్మీబాయి, డీపీఓ హనోక్‌, ఆర్డీఓ సాయిరాం, జిల్లా అధికారులు సుధాకర్‌, రత్నాకర్‌, శ్రీనివాసులు, యేసయ్య, పరశురాం, పద్మజారాణి,దేవయ్య, అశోక్‌కుమార్‌, వసంతరావు, నర్సయ్య, శ్రీనివాస్‌తోపాటు ఎంపీడీఓలు, ఏపీఓలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.