హరితహారం మొక్కల సంరక్షణకు చర్యలు 

సంగారెడ్డి,జూలై24(జ‌నంసాక్షి): ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమం కింద మొక్కలను నాటేందుకు  ప్రణాళికలు తీసుకున్న విధంగానే వాటిని రక్షించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్‌ఓ అన్నారు. వర్షాలు వెనక్కిపోవడంతో నాటిన మొక్కలను రక్షించుకోవాల్సి ఉందన్నారు. హరితహారం మొక్కల సంరక్షణకు జిల్లాల్లో తగిన చర్యలు తీసుకోవాలని అటవీ పర్యావరణ శాఖ ఆధికారులను ప్రభుత్వం ఆదేశించింది. హరితహారం కింద జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. నాటినమొక్కలను తప్పకుండా సంరక్షించాలన్నారు.  వర్షాలు లేనందున ఎండ తీవ్రత ఉన్నందున నాటిన వాటిని నీటిని అందించేందుకు  అలాగె మొక్క చుట్టూ ఫెన్సింగ్‌ చేసి సంరక్షంచే చర్యలు తీసుకోవాలన్నారు. అధికారుల ఆదేశాల మేరకు నాటిన మొక్కలను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో అనేక పంచాయితీల్లో వందశాతం మొక్కలు నాటి బాధ్యతను పూర్తి చేశామన్నారు. మానవ మనుగడకు కావాల్సిన స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అన్నింటినీ చెట్లే ఇస్తాయన్నారు. అందుకే హరితహారంలో విధిగా ఒక్కొక్కరు పది మొక్కలైనా నాటాలని డిఎఫ్‌వో సూచించారు.