హరితహారానికి సర్వం సిద్దం

సన్నద్దంగా ఉండాలిన అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

భద్రాద్రి కొత్తగూడెం,జూలై11(జ‌నం సాక్షి): నాలుగో విడత హరితహరం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మొక్కలను సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ పేర్కొన్నారు. జిల్లాలో హరితహారానికి సర్వం సిద్దం చేశారు. బుదశారం నుంచి మొక్కలు నాటేందుకు యంత్రాంగం సిద్ధమైంది. కొత్తగా ఏర్పడ్డ భద్రాద్రి జిల్లాలోని నాలుగు పురపాకాల్లో మొత్తం రెండు లక్షల మొక్కలను నాటాలని లక్ష్యం నిర్దేశించుకొన్నారు. నాటే మొక్కలు బతికేలా ఆయా పురపాలకాల కమిషనర్లే చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన అధికారుల సమావేశంలో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ ఆదేశించారు. గత మూడుమార్లు మాదిరిగా మొక్కలు నాటి వదిలేయ కుండా ఈ సారైనా వాటిని సంరక్షించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లోని రైతులకు టేకు మొక్కలు పంపిణీ చేసి, వాటిని పొలాల గట్లపై నాటే విధంగా ఉపాధి సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీవో పిడి జగత్‌కుమార్‌రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా అటవీరేంజ్‌ పరిధి అటవీ ప్రాంతంలో 70 వేల మారుజాతి మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. వెదురుడిపోలో ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. హరితాహారం ముందస్తు ప్రణాళిక గురించి మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. హరితహారం కార్యక్రమాన్ని ఏవిధంగా ముందుకు తీసుకుపోవాలనే అంశాలను, శాఖలవారీగా టార్గెట్‌, నాటబోయే మొక్కల సంరక్షణ, వివిధ నర్సరీలవారీగా మొక్కల వివరాల గురించి మండల అధికారులతో చర్చించారు. మూడో విడత హరితహారంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిడి కోరారు. వైల్డ్‌లైఫ్‌ ఆధ్వర్యంలోని తవిశెలగూడెం, కొమ్ముగూడెం, ఫారెస్ట్‌ డిపోల్లో మూడు లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రారంభం రోజున ప్రతీ మండలంలో ఐదు నుంచి పదివేల మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామాల్లో పంపిణీ చేసిన మొక్కల సంరక్షణ బాధ్యత సంబంధిత అధికారులదేనన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను పూర్తిస్థాయిలో సంరక్షిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. గ్రామ యువకులు పర్యావరణాన్ని కాపాడేందుకు మంచి మొక్కలను నాటే చర్యలు చేపట్టడం గర్వించదగిన విషయం అన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాల్లోని యువకులు హరితహారం కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంట్లో మొక్కలను నాటాలని సూచించారు. హరితహారంలో గ్రామజ్యోతి కమిటీలు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈజీఎస్‌ ఆధ్వర్యంలో మొక్కలను పంపిణీ చేస్తామని, ఎవరైనా రైతులు పండ్ల తోటల సాగు చేపడితే అవసరమైన మొక్కలను అందిస్తామన్నారు.