హావిూలను ఎందుకు విస్మరించారో ముందు చెప్పండి

ప్రగతినివేదన సభలో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): ఇచ్చిన హావిూలను ఎందుకు అమలు చేయలేదో ప్రగతినివేదన సభలో ముందుగా చెప్పి ప్రజలను క్షమాపణలు కోరాలని పిసిసి అధికార ప్రతినిధి, మెదక్‌ మాజీ ఎమ్మెల్యే ఎ.శశిధర్‌ రెడ్డి అన్నారు. దళిత ముఖ్యమంత్రి, మైనార్టీలకు రిజర్వేషన్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కెజి టూ పిజి ఉచిత విద్య తదితర వాగ్దానాలపై మాట్లాడాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. నియోజవర్గాల పరిధిలో సభలు ఏర్పాటు చేసి రెండు పడకగదులు, దళితులకు మూడెకరాలు, కేజీ పీజీ విద్య, మైనార్టీల, గిరిజనల రిజర్వేషన్‌ శాతం పెంపు అంశాలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తెరాస పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని ఆరోపించారు. గుత్తేదారులు, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పనుల నిర్వహణలోనూ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్నారు. రాష్ట్రంలో అధ్వాన పాలన సాగుతోందని, ప్రచార ఆర్భాటంతో ప్రజలను మోసగించేందుకే ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రగతి నివేదన సభను నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించి అభివృద్ధిని వివరించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ నగరంలో రహదారులు దెబ్బతిన్నా పట్టించుకునే వారు లేరన్నారు. ఇక జిల్లాల రోడ్లను పట్టించుకుంటారన్న భరోసా ఎక్కడిదన్నారు. తక్షణమే రోడ్లను నిర్మించాలని డిమాండ్‌ చేశారు.