హావిూలు నెరవేర్చాకే.. మోదీ ఏపీలో కాలుమోపాలి


– ఇక్కడికొచ్చి మాయమాటలు చెప్తానంటే కుదరదు
– వైకాపాకు ఓటేస్తే కేసీఆర్‌, మోదీకి పడినట్లే
– మళ్లీ టీడీపీ రావడం చారిత్రక అవసరం
– వరుస ఎన్నికలు రాబోతున్నాయి
– పార్టీ నేతలంతా నిత్యం ప్రజల్లో ఉండాలి
– 28న ఢిల్లీలో ఎన్డీయేతర పార్టీల సమావేశం ఉంది
– భవిష్యత్‌ కార్యాచరణ ఖరారు చేస్తాం
– టెలీ కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, ఫిబ్రవరి23(జ‌నంసాక్షి) : ఏపీ విభజన హావిూలు అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రాష్ట్ర హావిూలు నెరవేర్చాకే ప్రధాని మోదీ ఏపీలో కాలు మోపాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం తెదేపా నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క ఓటు వైకాపాకు పడినా అది కేసీఆర్‌కు, మోదీకి పడినట్లేనని, ఈ విషయం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చాకే తెలుగువాడి ఉనికి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఆనాడు ఢిల్లీ కుట్రలను ఎన్టీఆర్‌ ఎలా తిప్పికొట్టారో అదే స్ఫూర్తితో ఇప్పుడూ తిప్పికొట్టాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ప్రత్యేక ¬దా అనేది దేశం ఇచ్చిన హావిూ అని, రాహుల్‌ గాంధీ కూడా ఇస్తామని స్పష్టం చేశారన్నారు. ప్రధాని ఏపీకొచ్చి మాయమాటలు చెప్తానంటే కుదరదని, మనల్ని విమర్శించడానికే వస్తానంటే మాత్రం ఢిల్లీలోనే కూర్చోవాలని హితవు పలికారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం విభేదాలు వీడి చిరకాల ప్రత్యర్థులు తెదేపాలో చేరుతున్నారని తెలిపారు. ఆదినారాయణ రెడ్డి- రామసుబ్బారెడ్డి, కోట్ల-కేఈ కుటుంబాలే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. 28న ఢిల్లీలో ఎన్డీయేతర పార్టీల సమావేశం ఉందని, ఇందులో భవిష్యత్‌ కార్యాచరణ ఖరారు చేస్తామని స్పష్టంచేశారు. ఈ ఏడాది ఆర్నెళ్లు పాటు వరుస ఎన్నికలు ఉంటాయని, పార్టీనేతలు నిత్యం ప్రజల్లోనే ఉండాలని సూచించారు.
ఎవరిని ఎక్కడ నిలపాలో నాకు వదిలేయండి..
ఏడు పార్లమెంట్‌ నియోజకవర్గాలపై తొలిదశ చర్చలు పూర్తయ్యాయని అందరితో మాట్లాడి అభ్యర్ధులపై ఒక అంచనాకు వచ్చామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం నుంచి 60మంది సమన్వయ సభ్యులతో భేటీ అవనున్నట్లు చంద్రబాబు తెలిపారు. పార్టీలో అందరికీ గుర్తింపు, గౌరవం ఉంటుందని, ఎవరిని ఎక్కడ బరిలోకి దించాలో తనకు వదిలేయాలని అన్నారు. రాయలసీమలో టీడీపీ పట్ల పూర్తి సానుకూలత ఉందని తెలిపారు. నీళ్లు ఇచ్చామని, పంట దిగుబడులు పెంచామన్నారు. రాయలసీమ చివరంటా కృష్ణా జలాలు తెచ్చామని చెప్పారు. ఊరూరా కృష్ణా జలాలకు రైతులే హారతులిస్తున్నారని సీఎం తెలిపారు. రైతుల్లో పూర్తి సానుకూలతే టీడీపీకి శుభపరిణామమని అన్నారు. సంక్షేమం పట్ల పేదల్లో పూర్తి సంతృప్తి టీడీపీకి వరమన్నారు. ఈ ఐదేళ్లలో మనం అన్ని పనులు బాగా చేశామని తెలిపారు. ప్రజలు పెట్టిన పరీక్షలు చక్కగా రాశామని, అద్భుత ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ వర్గానికి ఏం మేలు చేశామో ఆయా వర్గాలకు చెప్పాలన్నారు. వ్యవసాయానికి చేసిన మేళ్లు రైతులకు వివరించాలని సూచించారు. ఉపాధి కల్పనకు ఏం చేశామో నిరుద్యోగులకు చెప్పాలన్నారు. పరిశ్రమలు ఎన్నితెచ్చామో యువతకు చెప్పాలని నేతలకు చంద్రబాబు తెలియజేశారు.